తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి రోజు.. పతక వేటలో భారత ఆర్చర్లు

మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది ఆర్చర్‌ దీపికా కుమారి. మహిళల వ్యక్తిగత విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండేళ్లుగా ఆమె బరిలోకి దిగిన ప్రతి పోటీలో విజయంతోనే తిరిగొస్తోంది. కోరుకున్న వాడినే భర్తగా చేసుకున్న దీపిక.. తన జీవిత భాగస్వామి అతానుదాస్‌తో కలిసి స్వర్ణాలు ముద్దాడుతుందా? టోక్యో ఒలింపిక్స్‌ తొలి రోజే భారత్‌కు కీర్తి తెచ్చిపెడుతుందా?

Tokyo Olympics: First Day Show of Olympics for Indian Archers
పతకానికి​ తొలి రోజే 'గురి'పెట్టనున్న భారత ఆర్చర్లు

By

Published : Jul 22, 2021, 10:28 PM IST

టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభం రోజే భారత క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. విలువిద్య వ్యక్తిగత విభాగాల్లో దీపికా కుమారి, ఆమె భర్త అతాను దాస్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌ పోటీ పడుతున్నారు. టోక్యో ముందు పారిస్‌లో జరిగిన ప్రపంచకప్‌లో వీరంతా అదరగొట్టారు. మూడు విభాగాల్లో దీపిక స్వర్ణాలు కొల్లగొట్టింది. వ్యక్తిగత, మిక్స్‌డ్‌, బృంద పోటీల్లో దుమ్మురేపింది. ఇప్పుడు అదే ఇంద్రజాలాన్ని మరోసారి ప్రదర్శించాలని యావత్‌ భారతావని కోరుకుంటోంది. అందరికన్నా ముందుగా తన మెడలో పతకం అలంకరించుకోవాలని భావిస్తోంది. వ్యక్తిగత, మిక్స్‌డ్‌లో ఆమెకు పతకావశాలు ఉన్నాయి.

దీపికా కుమారి

వేగంగా తెరపైకి

ఇప్పటి వరకు విలువిద్యలో భారత్‌ ఎంతోమంది విజేతలను ప్రపంచానికి అందించింది. అనేక పోటీల్లో విజయ దుందుభి మోగించినా ఒలింపిక్స్‌లో మాత్రం వారు పతకాలు తేలేకపోయారు. 2006లో జయంత్‌ తాలుక్‌దార్‌ ప్రపంచ రెండో ర్యాంకర్‌గా అవతరించాడు. ఆ తర్వాత డోలా బెనర్జీ అగ్రస్థానం అందుకుంది. అయితే 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో మాత్రం వీరు అంచనాలు అందుకోలేక పోయారు. వారి తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చింది దీపిక.

ప్రపంచకప్‌లో 3 స్వర్ణాలు

2009లో యూత్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో 15 ఏళ్ల వయసులో దీపిక విజేతగా ఆవిర్భవించింది. ఆ తర్వాతి ఏడాదే దిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు స్వర్ణాలు ముద్దాడింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మాత్రం తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. 2016 రియో క్రీడల్లోనూ శ్రమించినా పతకం అందుకోలేదు. అగ్రశ్రేణి ఆర్చర్లతో ఆమె పోటీపడ్డ తీరు ఆకట్టుకుంది. ఇక ఈ ఐదేళ్లలో తన నైపుణ్యాలను మరింత సానబెట్టుకుంది. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌కు ఎంపికైంది. ఈ మధ్య కాలంలోనే ప్రపంచకప్‌లో ఐదు స్వర్ణాలు కొల్లగొట్టి రెండోసారి ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది.

అతాను దాస్​, దీపికా కుమారి

కొరియన్లతో ముప్పు

దూకుడుగా ఆడే దీపికకు కొరియన్ల నుంచే అసలైన ముప్పు పొంచివుంది. ఎందుకంటే వారు మానసికంగా, శారీకంగా ఎంతో బలవంతులు. విలువిద్యలో తిరుగులేదు. రియోలోనూ వారు హవా కొనసాగించారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చంగ్‌ హై జిన్‌ లేకపోయినా కాంగ్‌ చే యంగ్‌ నుంచి సవాల్‌ ఎదురవ్వనుంది. 2019, జులైలో అర్హత పోటీల్లో వరుస సెట్లలో దీపికను ఓడించిన ఆన్‌ సన్‌ కూడా గట్టి పోటీదారే. 'ఇప్పటివరకు భారత్‌కు ఒలింపిక్‌ పతకం లేదు. అందుకే నేను గెలవాలి. నేను గెలవగలనని నిరూపించాలని భావిస్తున్నా. ఇది నాకూ, నా దేశానికి ఎంతో కీలకం' అని దీపిక ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.

అతాను దాసు

పురుషుల జట్టూ బలంగానే!

భారత పురుషుల జట్టు 2012 తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వెటరన్‌ ఆర్మీ ఆర్చర్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌, అతాను దాస్‌తో జట్టు బలంగా ఉంది. 2019 ప్రపంచకప్‌లో రజతం గెలిచి టోక్యో బెర్త్‌ సాధించింది. 2004, ఏథెన్స్‌లో ఆడిన రాయ్‌కు ఇది మూడో ఒలింపిక్స్‌. అతానుకు రెండోది. రియోలో అతడు బాగానే పోరాడాడు. 2019 ద్వితీయార్ధం నుంచి కొరియా, చైనీస్‌ తైపీ, చైనా, జపాన్‌ అంతర్జాతీయ వేదికల్లో పోటీ పడకపోవడం వల్ల పతకాలు ఎవరు గెలుస్తారో సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితి. వారి నుంచి టీమ్‌ఇండియాకు గట్టి పోటీ ఎదురవ్వడంలో ఆశ్చర్యమైతే లేదు.

ఒలింపిక్స్​లో భారత ఆర్చర్లు పోటీ ఎప్పుడంటే..?

తేదీ

సమయం

(భారత కాలమానం)

క్రీడా విభాగం జులై 23 ఉదయం 5.30 గంటలకు

ఆర్చరీ

(మహిళల వ్యక్తిగత

ర్యాంకింగ్​ రౌండ్​)

జులై 23 ఉదయం 9.30 గంటలకు

ఆర్చరీ

(మహిళల వ్యక్తిగత

ర్యాంకింగ్​ రౌండ్​)

జులై 23 సాయంత్రం 4.30 గంటలకు

టోక్యో ఒలింపిక్స్​

ప్రారంభోత్సవ వేడుక

ఇదీ చూడండి..ఒక్క ఒలింపిక్స్​లో 32 ప్రపంచ రికార్డులు..

ABOUT THE AUTHOR

...view details