వివిధ దేశాధినేతలు, ఆయా దేశాల జాతీయ పతకాల రెపరెపలు, నృత్య ప్రదర్శనలు.. ఇలా అట్టహాసంగా జరగాల్సిన ఒలింపిక్స్ గతేడాది కరోనా కారణంగా 2021కి వాయిదా పడింది. మొత్తంగా ఎన్నో సవాళ్లను అధిగమించి ఎట్టకేలకు జులై 23(శుక్రవారం) సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకతో.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్‌కు తెరలేవనుంది. ఎప్పుడూ ఎంతో ఘనంగా జరిగే ఒలింపిక్స్ ఈ సారి కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మెగాఈవెంట్ గురించి కొన్ని విశేషాలు మీ కోసం..
- విశ్వక్రీడల చరిత్రలో టోక్యో ఒలింపిక్స్ 32వది.
- జపాన్ రాజధాని టోక్యో జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగే ప్రారంభోత్సవంతో ఒలింపిక్స్‌కు తెరలేవనుంది.
- కరోనా నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, మంగోలియన్ ప్రధాని ఓయున్-ఎర్డెనే, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో పాటు మరికొంత మంది విశ్వక్రీడల ఆరంభ వేడుకకు వస్తామని ఇదివరకే ప్రకటించారు.
- భారత తరఫున పతాకధారులుగా పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్ సింగ్, బాక్సర్ మేరీకోమ్ ఉన్నారు.
- మొత్తంగా ఈ సారి ఒలింపిక్స్‌లో దాదాపుగా 206 దేశాల నుంచి సుమారుగా 11 వేల అథ్లెట్లు పాల్గొంటున్నారు.
- 33 క్రీడల కోసం 339 బంగారు పతకాలను నిర్వాహకులు సిద్ధం చేశారు.
- ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున 127 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు.
- టోక్యో ఒలింపిక్స్‌ను భారతదేశంలో సోనీ టెన్ 1, సోనీ టెన్ 2లో ఇంగ్లీష్ వ్యాఖ్యానం.. సోనీ టెన్ 3లో హిందీ వ్యాఖ్యానంతో ప్రసారం చేయనున్నారు. జియో టీవీలో ప్రత్యక్షప్రసారంగా చూడొచ్చు.
- ఇప్పటికే రెండురోజుల ముందు నుంచే ఈ మెగాఈవెంట్కు సంబంధించిన సాఫ్ట్ బాల్, ఫుట్‌బాల్ టోర్నీలు ప్రారంభమైపోయాయి.
- ఈ ఒలింపిక్స్ కోసం.. చరిత్రలోనే తొలిసారి రీసైక్లింగ్ చేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పతకాలు తయారుచేశారు. మెడల్స్ కోసం దాదాపు 62 లక్షల మొబైల్ ఫోన్లను రీసైక్లింగ్ చేశారు. 32 కిలోల బంగారం కూడా స్వర్ణ పతకాల కోసం ఉపయోగించారు.
- టోక్యో ఒలింపిక్స్‌లో ఇచ్చే గోల్డ్ మెడల్ బరువు 556 గ్రాములు. రజతం 550 గ్రాములు, కాంస్యం 450 గ్రాములు ఉండనుంది.
- 2024 ఒలింపిక్స్ పారిస్(ఫ్రాన్స్)లో జరగనున్నాయి. 2028 ఒలింపిక్స్- లాస్ ఏంజెలెస్ (అమెరికా), 2032 ఒలింపిక్స్- బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) వేదికగా జరగనున్నాయి.
ఇదీ చూడండి:'ఒలింపిక్ ఛాంపియన్'గా నల్లజాతీయుడు.. అదే తొలిసారి!