ప్రపంచంలోనే అత్యున్నత క్రీడా సంగ్రామమైన ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని అథ్లెట్లు కలలు కంటారు. విజేతగా నిలిస్తే తమ కెరీర్‌కు సార్థకత వచ్చిందని సంబరపడిపోతారు. మరి అలాంటి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే పతకాలకు ఎంతో ప్రత్యేకత ఉండాలి? ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో పోడియంపై నిలబడే అథ్లెట్లకు ఇచ్చే పతకాల విషయంలో ఓ విశేషం ఉంది. వాడిపాడేసిన సెల్‌ఫోన్లు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుంచి తీసిన బంగారం, వెండి, కంచుతో ఈ పతకాలకు రూపమిచ్చారు. దాదాపు 79 వేల టన్నులకు పైగా పునర్వినియోగ ఎలక్ట్రానిక్ చెత్తను జపాన్ ప్రజల నుంచి సేకరించిన టోక్యో నిర్వాహకులు పతకాలను తయారు చేశారు. 8.5 సెంటీమీటర్ల వ్యాసంతో ఉండే ఈ పతకాలపై గ్రీకు విజయ దేవత నైక్ ఎగురుతున్న బొమ్మ ఉంటుంది.
ఆలివ్ దండతో మొదలై..:
పురాతన ఒలింపిక్ క్రీడల్లో విజేతగా నిలిచిన అథ్లెట్లకు బహుమతిగా ఆలివ్ ఆకులతో చేసిన దండను తలపై పెట్టేవాళ్లు. 1896 ఏథెన్స్ ఒలింపిక్స్ నుంచే విజేతలకు పతకాలు అందించడం మొదలైంది. విజేతలకు రజతం, రన్నరప్‌గా నిలిచిన వాళ్లకు రాగి లేదా కాంస్య పతకం ఇచ్చేవాళ్లు. గ్రీకు పురాణాల ప్రకారం దేవతలకు తండ్రి అయిన జ్యూస్ గౌరవార్థం ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. అందుకే పతకానికి ముందు భాగంలో నైక్‌ను పట్టుకుని ఉన్న జ్యూస్ బొమ్మ ఉండేది. వెనక వైపు వివిధ భవనాలతో కూడిన ఆక్రోపోలిస్ చిత్రం ఉండేది. ఎనిమిదేళ్ల వరకూ అవే పతకాలు కొనసాగాయి. 1904లో తొలిసారిగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ఉపయోగించారు. గ్రీకు పురాణాల ప్రకారం ఈ మూడు పతకాలు మూడు తరాలకు ప్రతీకలుగా భావిస్తారు.