ఒలింపిక్స్ అంటే చిన్న విషయం కాదు. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వడాన్ని ప్రపంచ దేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. లక్షల కోట్ల ఖర్చుతో నిర్వహించే ఈ క్రీడాసంబరం బిడ్ దక్కించుకోవడానికి ఎంత పోటీ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ అరుదైన అవకాశం పొంది.. భారీగా ఖర్చు చేసి ఒలింపిక్స్‌కు సన్నాహాలు పూర్తి చేశాక.. క్రీడల నిర్వహణపై సందేహాలు తలెత్తితే..? టోర్నీని రద్దు చేయడమో లేదా వాయిదా వేయడమో తప్పని పరిస్థితి వస్తే..? టోక్యో ఇప్పుడు ఇలాంటి ప్రమాదాన్నే ఎదుర్కొంటోంది.
కరోనా వల్లే నీలినీడలు...
జులై-ఆగస్టు నెలల్లో టోక్యో నగరంలో జరగాల్సిన మెగా ఈవెంట్‌ను కరోనా వైరస్ ముప్పు ముసురుకుంటోంది. టోర్నీ సజావుగా సాగడం సందేహంగానే ఉంది. క్రీడలు వాయిదా పడొచ్చంటున్నారు. లేదా మరో చోటికి తరలించే అవకాశముందంటున్నారు. మొత్తంగా టోర్నీనే రద్దయినా ఆశ్చర్యం లేదనీ వార్తలొస్తున్నాయి. అయితే ఈసారి ఏం జరుగుతుందో ఏమో కానీ.. గతంలో ఓసారి టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ రద్దవడం గమనార్హం.
80 ఏళ్ల నాటి ఫలితమేనా?
సరిగ్గా 80 ఏళ్ల కిందట టోక్యోకు ఒకసారి షాక్ తగిలింది. 1940లో టోక్యో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కింది. 1923లో భూకంపం ధాటికి కుదేలైన టోక్యో.. ఆ ప్రభావం నుంచి పూర్తిగా బయటపడ్డామని, కుదురుకున్నామని ప్రపంచానికి చాటడం కోసమే.. 1940 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం బిడ్ వేసింది. అయితే ఒలింపిక్స్ కోసం చురుగ్గా సన్నాహాలు సాగుతుండగా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ టోక్యోకు ఆతిథ్య హక్కులు రద్దు చేసింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడడమే అందుక్కారణం. టోక్యోలో కాకుండా హెల్సింకిలో క్రీడలు నిర్వహించాలని ఐఓసీ నిర్ణయించగా.. చివరికి రెండో ప్రపంచ యుద్ధం కారణంగా అప్పుడు ఒలింపిక్స్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
అంతకుముందు 1916 బెర్లిన్‌లో జరగాల్సిన ఒలింపిక్స్ కూడా మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దయ్యాయి. చరిత్రలో ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఒలింపిక్స్ రద్దయ్యాయి. ఇప్పుడు కరోనా ధాటికి విపత్కర పరిస్థితులు తలెత్తుతుండటం వల్ల మరోసారి టోక్యో బాధితురాలిగా మారుతుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.