చైనాతో పాటు పలు దేశాలను వణికిస్తోన్న 'కరోనా' ప్రభావం... టోక్యో ఒలింపిక్స్ ముందస్తు కార్యక్రమాలపై పడుతోంది. వాలంటీర్లకు నేటి నుంచి జరగాల్సిన శిక్షణా తరగతులను నిర్వాహకులు.. ఈ కారణంగానే వాయిదా వేశారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మారిన తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు.
జులై 24 నుంచి ఈ క్రీడలు మొదలుకానున్నాయి. వీటి నిర్వహణపై ఈ వైరస్ ప్రభావం ఏం ఉండదని, కచ్చితంగా అనుకున్న సమయానికి టోర్నీ ప్రారంభిస్తామన్నారు ఒలింపిక్స్ నిర్వాహకులు. వచ్చే నెల(మార్చి) 1న టోక్యో మారథాన్ నిర్వహించనున్నారు. దీనికి పలువురు అథ్లెట్లు హాజరుకానున్నారు.
జపాన్లో ఇప్పటికే దాదాపు 100 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు మరణించారు. ఇటీవల ఆ దేశంలోని యెకోహమా తీరంలో నిలిపి ఉంచిన నౌకలో.. దాదాపు 500 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.