నీరజ్ చోప్రా స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించింది భారత్. అలాగే విశ్వక్రీడల చరిత్రలో ఎక్కువ పతకాలు సాధించింది ఇండియా. మొత్తం ఏడు పతకాలు దక్కించుకుంది. కానీ కరోనా కారణంగా వచ్చే ఒలింపిక్స్ మూడేళ్లలోనే జరగనున్నాయి. గతేడాది జరగాల్సిన టోక్యో క్రీడలు ఏడాది వాయిదపడటమే ఇందుకు కారణం. తాజాగా ఈ విషయంపై స్పందించిన భారత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా.. వచ్చే పోటీలు కాస్త కష్టతరంగా ఉండబోతున్నాయని తెలిపాడు.
"టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో భారత్ మంచి ప్రదర్శన చేసింది. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగుతుంది. కానీ వచ్చే ఒలింపిక్ సైకిల్ కాస్త కష్టతరంగా ఉండబోతుంది. తక్కువ సమయం ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా ఒలింపిక్స్ ముగిశాక విశ్రాంతి, రికవరీ కోసం ఆటగాళ్లకు ఏడాది అవసరమవుతుంది. అయితే ఈసారి విశ్వక్రీడలు తొందరగా జరగబోతున్నాయి."
-అభినవ్ బింద్రా, షూటర్