Thomas and uber cup 2022 final: చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు సిసలు సమరానికి సిద్ధమైంది. ఇండోనేసియాతో ఆదివారం జరిగే ఫైనల్లో గెలిచి చరిత్ర సృష్టించేందుకు కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. క్వార్టర్స్‌లో మలేసియా.. సెమీస్‌లో డెన్మార్క్ లాంటి బలమైన జట్లను ఓడించిన భారత్‌కు పద్నాలుగుసార్లు ఛాంపియన్ ఇండోనేసియాతో పోరు అంత సులభం కాదు. ప్రస్తుత టోర్నీలో ఒక్క ఓటమి కూడా చవిచూడని ఇండోనేసియాకు షాక్ ఇవ్వాలంటే భారత్ అసాధారణంగా ఆడాల్సి ఉంది. సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్‌తో పాటు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ రన్నరప్ లక్ష్యసేన్ సత్తా చాటాలి. ఈ టోర్నీలో ఇప్పటిదాకా శ్రీకాంత్, ప్రణయ్ స్థిరంగా రాణిస్తుండగా.. యువ లక్ష్యసేన్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అస్వస్థత కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య.. మలేసియా, డెన్మార్క్‌లతో కీలక సమరాల్లో విఫలమయ్యాడు. ఫైనల్లో అతడు కూడా ఓ చేయి వేస్తే ఇండోనేసియా కోటను బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాబోదు. తుది సమరంలో లక్ష్య.. ప్రపంచ నాలుగో ర్యాంకర్ గింటింగ్‌తో పోటీపడే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జర్మన్ ఓపెన్లో గింటింగ్‌పై సులభంగా గెలిచిన నేపథ్యంలో ఈసారి అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరం. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ జోనాథన్ క్రిస్టితో శ్రీకాంత్ తలపడొచ్చు. క్రిస్టిపై శ్రీకాంత్ జయాపజయాల రికార్డు 4-5గా ఉంది. ఈ ఏడాది క్రిస్టితో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ ఓడిపోయాడు. డెన్మార్క్‌తో సెమీస్‌లో కాలు బెణకడంతో ఇబ్బందిపడ్డ ప్రణయ్.. హిరెన్‌తో పోటీపడే అవకాశముంది. హిరెన్‌పై ప్రణయ్‌కు 2-0 రికార్డు ఉంది.
పసిడి వేటలో భారత్.. చరిత్ర తిరగరాసేనా? - uber cup srikanth
Thomas and uber cup 2022 final: భారత్ ఒకవైపు.. పసిడి మరోవైపు.. మధ్యలో 14సార్లు ఛాంపియన్ ఇండోనేసియా! ఈ బలమైన జట్టును ఓడించి భారత్ చరిత్ర సృష్టిస్తుందా! బ్యాడ్మింటన్‌లో ఓ సువర్ణాధ్యాయానికి తెరలేస్తుందా? వీటికి సమాధానం తెలియాలంటే నేడు(ఆదివారం) జరగబోయే థామస్‌కప్ బ్యాడ్మింటన్ ఫైనల్ చూడాల్సిందే..
డబుల్స్ కీలకం:డబుల్స్‌లో భారత ఉత్తమ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి ఇప్పటిదాకా నిరాశపరచలేదు. అవసరమైన ప్రతిసారీ జట్టును ఆదుకుంది. కానీ యువ జంట కృష్ణప్రసాద్-విష్ణువర్దన్ భారత జట్టులో బలహీనంగా కనిపిస్తోంది. ఫైనల్లో వారి స్థానంలో ధ్రువ్ కపిల-ఎంఆర్ అర్జున్‌లను ఆడించే అవకాశాలున్నాయి. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఆడిన ధ్రువ్ జోడీ ఒక మ్యాచ్‌లో ఓడి.. ఒక మ్యాచ్‌లో నెగ్గింది. అయితే డబుల్స్‌లో ఇండోనేసియాకు బలమైన జోడీలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ టాప్ డబుల్స్ స్పెషలిస్టులు మహ్మద్ అసాన్, హెండ్రా సెతివాన్, కెవిన్ సంజయ, ఫజార్, మహ్మద్ రియాన్ లాంటి షట్లర్లు ఇండోనేసియా సొంతం. ఈ నేపథ్యంలో డబుల్స్‌లో గెలవాలంటే భారత్ గొప్ప ప్రదర్శన చేయాల్సి ఉంది. ‘‘భారత్ జట్టు సమతూకంతో ఉంది. ముఖ్యంగా డబుల్స్ జోడీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. దాదాపు అందరు షట్లర్లు మ్యాచ్‌లు చేజారే సమయాల్లోనూ గొప్పగా పుంజుకుని గెలుస్తున్నారు. ఇక్కడ వాతావరణ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. గాలి ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులకు అలవాటుపడే వారికే విజయావకాశాలు ఉంటాయి. ఇండోనేసియాతో ఫైనల్లో మనకు 50-50 ఛాన్స్ ఉంది’’ అని భారత మాజీ కోచ్ విమల్ కుమార్ చెప్పాడు. భారత్-ఇండోనేసియా తుది పోరు స్పోర్ట్స్-18 ఛానెల్‌లో ఉదయం 11.30 నుంచి ప్రసారం కానుంది.
ఇదీ చూడండి: ఇంకొక్క అడుగు వేస్తే.. స్వర్ణం మనదే