కరోనా మహమ్మారి క్రీడల పోటీలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఎక్కువగా జట్లు, క్రీడాకారులు, సిబ్బంది పాల్గొనే టోర్నీలపై ప్రభావం చూపిస్తూ, సవ్యంగా సాగనివ్వడం లేదు. పాజిటివ్ కేసులు రావడం వల్ల ఇప్పటికే ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. అలానే ఒలింపిక్స్‌కు కొవిడ్ ముప్పు తప్పేలా కనిపించట్లేదు. బహుశా మెగా క్రీడలు కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ గతే సంవత్సరమే జరగాలి. కానీ కరోనా కారణంగా ఏడాది వాయిదా పడింది. ఈ ఏడాది జులైలో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో జపాన్‌లోని నగరాల్లో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతుండటం వల్ల ప్రభుత్వం కరోనా అత్యయిక స్థితిని పొడగించనుందని సమాచారం. కేసులు పెరగడం వల్ల క్రీడలు జరగాల్సిన టోక్యో, ఒసాక, క్యోటో, హ్యోగో ప్రాంతాల్లో మే 11 వరకు అత్యయిక స్థితిని పొడగిస్తారని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.