తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: కుర్రాళ్లేనా.. మేమూ అదరగొడతాం!

టోక్యో ఒలింపిక్స్​లో యువ అథ్లెట్లు మాత్రమే కాదు 70 ఏళ్లు పైబడిన క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సారి మెగాక్రీడల్లో 57 ఏళ్ల అమెరికా ఈక్వెస్ట్రియన్‌ క్రీడాకారుడు ఫిలిప్‌ డుటాన్‌ అత్యంత పెద్ద వయస్కుడైన ఒలింపియన్‌గా నిలవనున్నాడు. మరోవైపు ఒలింపిక్‌ నినాదంలో మరో పదాన్ని చేర్చారు. ఇప్పటివరకు "ఫాస్టర్‌, హయ్యర్‌, స్ట్రాంగర్‌" నినాదంగా ఉండగా.. ఇప్పుడు దాన్ని "ఫాస్టర్‌, హయ్యర్‌, స్ట్రాంగర్‌-టుగెదర్‌'గా మార్చారు.

Olympics
ఒలింపిక్స్​

By

Published : Jul 21, 2021, 8:50 AM IST

ఆట ఏదైనా యువతరానిదే ఆధిపత్యం! శారీరకంగా అత్యుత్తమ స్థితిలో ఉండేది యుక్త వయసులోనే కాబట్టి ఆటల్లో ఎక్కువగా రాణించేది యువ క్రీడాకారులే. ఒలింపిక్స్‌ లాంటి ఈవెంట్లలో అయితే యువ అథ్లెట్ల హవా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాగని వయసు పైబడ్డ క్రీడాకారులే ఒలింపిక్స్‌లో ఉండరా అంటే.. అదేం కాదు! 70 ఏళ్లు పైబడ్డాక కూడా ఒలింపిక్స్‌లో పోటీపడ్డ క్రీడాకారులన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. 1920 ఒలింపిక్స్‌లో ఆస్కార్‌ స్వాన్‌ అనే స్వీడన్‌ షూటర్‌ 72 ఏళ్ల 280 రోజుల వయసులో విశ్వక్రీడల్లో పోటీ పడటమే కాదు.. రజతం కూడా గెలవడం విశేషం. ఒలింపిక్స్‌లో పోటీ పడ్డ, పతకం గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడంటే జాన్‌ కాప్లీ. 1948 ఒలింపిక్స్‌లో పోటీ పడ్డప్పుడు ఆయన వయసు 73 ఏళ్లు. అయితే ఆయన పోటీ పడ్డది పెయింటింగ్‌లో కావడం వల్ల ఈ ఘనతను ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు.

ప్రస్తుత టోక్యో క్రీడల విషయానికొస్తే 57 ఏళ్ల అమెరికా ఈక్వెస్ట్రియన్‌ క్రీడాకారుడు ఫిలిప్‌ డుటాన్‌ అత్యంత పెద్ద వయస్కుడైన ఒలింపియన్‌గా నిలవనున్నాడు. ఆయనకిది ఏడో ఒలింపిక్స్‌ కావడం విశేషం. 2016 ఒలింపిక్స్‌లో డుటాన్‌ 52 ఏళ్ల వయసులో కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఇక తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగు పెడుతున్న స్కేట్‌బోర్డింగ్‌ క్రీడలో దక్షిణాఫ్రికా తరఫున పోటీ పడుతున్న డలాస్‌ ఒబెర్‌హోల్జర్‌ వయసు 46 ఏళ్లు. అతను ఈ ఈవెంట్లో స్వర్ణానికి ఫేవరెట్‌ అట. ఒలింపిక్స్‌ ఫుట్‌బాల్‌ జట్లు యువ క్రీడాకారులకే పెద్ద పీట వేస్తాయి కానీ.. టోక్యోలో బరిలోకి అమెరికా మహిళల జట్టు మాత్రం సగటు వయసు 30.8తో బరిలో దిగుతుండటం విశేషం. ఆ జట్టులో అత్యంత పెద్ద వయస్కురాలైన కార్లి లాయిడ్‌ వయసు 39 ఏళ్లు. ఇదే జట్టులోని మెగాన్‌ రాపినో, బెకీ సోర్‌బ్రన్‌ల వయసు 36 ఏళ్లు. బ్రెజిల్‌ అయితే 43 ఏళ్ల ఫార్మిగాను తమ జట్టులో ఆడిస్తోంది. మిగతా ఆటల సంగతెలా ఉన్నా.. ఒంటిని ఎలా పడితే అలా వంచాల్సిన జిమ్నాస్టిక్స్‌లో పెద్ద వయస్కులకు చోటు కష్టమే. టీనేజీ క్రీడాకారులతో మొదలుపెట్టి 30 ఏళ్ల లోపు వాళ్లే దాదాపుగా కనిపిస్తారు. ఇలాంటి క్రీడలో ఉజ్బెకిస్థాన్‌ తరఫున 46 ఏళ్ల ఒక్సానా చుసోవితినాను వాల్ట్‌ ఈవెంట్లో చూడబోతున్నాం. బీచ్‌ వాలీబాల్‌లో పోటీ పడనున్న 45 ఏళ్ల జేక్‌ గిబ్‌ కూడా టోక్యోలో బరిలోకి దిగుతున్న పెద్ద వయస్కుల్లో ఒకరు.

డుటాన్​
ఒక్సానా

ఒలింపిక్స్​లో కరోనా

టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి ఓ వాలంటీరుకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. వాలంటీరుతో పాటు ఈవెంట్‌తో ప్రమేయం ఉన్న ఏడు మంది కాంట్రాక్టర్లకు, ఓ కోచ్‌కు కరోనా సోకినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఒలింపిక్‌ గ్రామంలో ఉన్న ముగ్గురు అథ్లెట్లకు సహా మొత్తం అయిదుగురు అథ్లెట్లకు సోమవారం వరకు పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం చెక్‌ బీచ్‌ బాలీబాల్‌ కోచ్‌ సైమన్‌ నాచ్‌ కూడా కరోనా బారినపడ్డాడు. ఈవెంట్‌కు ముందు, జరుగుతున్నప్పుడు, ముగిశాక.. కార్యకలాపాల్లో క్రీడల వాలంటీర్లు సహకరిస్తుంటారు. మరోవైపు ఒలింపిక్‌ నినాదంలో మరో పదాన్ని చేర్చారు. ఇప్పటివరకు "ఫాస్టర్‌, హయ్యర్‌, స్ట్రాంగర్‌" అన్న నినాదంగా ఉండగా.. ఇప్పుడు దాన్ని "ఫాస్టర్‌, హయ్యర్‌, స్ట్రాంగర్‌-టుగెదర్‌'గా మార్చారు. ఈ మేరకు ఐఓసీ చార్టర్‌కు చేసిన సవరణను సభ్యులు ఏకగ్రీవంగా ధ్రువీకరించారు.

ఇదీ చూడండి: Olympics: వీళ్లు తక్కువేం కాదు.. అద్భుతాలు చేయగలరు!

ABOUT THE AUTHOR

...view details