స్టేడియంలో 'ఫ్యాన్స్ ఫైట్'.. ఇలాంటి విషాదాలు ఎన్నో.. ఆ మ్యాచ్‌లో ఏకంగా 20వేల మంది! - ఇండోనేషియా స్టేడియం న్యూస్
ఇండోనేషియాలోని ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన దారుణ ఘటన క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. ఫుట్‌బాల్ మ్యాచ్ చూద్దామని వచ్చిన ప్రేక్షకుల్లో 125 మంది అభిమానులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం పెద్ద విషాదమే. ప్రపంచవ్యాప్తంగా క్రీడా మైదానాల్లో ఆట చూసేందుకు వచ్చిన అభిమానులు ప్రాణాలు పొగొట్టుకున్న దుర్ఘటనలు చాలానే ఉన్నాయి. ఆ దుర్ఘటనల్లో ఇప్పటివరకు దాదాపు 800 మందికిపైగా దుర్మరణం చెందారు. అందులో కొన్ని...
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దారుణం
ఇండోనేషియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ వీక్షించిద్దామని వచ్చిన ప్రేక్షకుల్లో 125 మంది తొక్కిసలాటలో దుర్మరణం పాలయ్యారు. 180 మంది దాకా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా క్రీడా మైదానాల్లో ఆట చూసేందుకు వచ్చిన అభిమానులు ప్రాణాలు పొగొట్టుకున్న దుర్ఘటనలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని...
-
1964, మే 24.. పెరులోని లీమ నగరంలోని ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన దారుణ ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడిన రోజది. అర్జెంటీనా, పెరు మ్యాచ్ చివర్లో ఓ గోల్ వివాదాస్పదం కావడంతో అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వీళ్లను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రధాన మార్గాలన్నీ మూసివేయడంతో బయటకు వెళ్లే దారి లేక తొక్కిసలాటలో 328 మంది కన్నుమూశారు - 1980, జవనరి 20న కొలంబియాలోని సిన్స్‌లెజోలో బుల్‌ఫైట్ చూద్దామని వచ్చిన ప్రేక్షకుల్లో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కలపతో నిర్మించిన నాలుగంతస్తుల తాత్కాలిక స్టేడియం కూలిపోవడమే అందుకు కారణం. ఆ శిథిలాల కింద పడి అభిమానులు మృత్యువాత పడ్డారు.
- అది 1988, మార్చి 13.. 93 మంది అభిమానుల ప్రాణాలను వడగళ్ల వర్షం బలి తీసుకుంది. ఖాట్మాండులో నేపాల్, బంగ్లాదేశ్ మ్యాచ్ మధ్యలో ఒక్కసారిగా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించడంతో తోపులాట జరిగి ప్రాణాలు పోయాయి.
- 1989, ఏప్రిల్ 15న హిల్స్‌బర్గ్‌లోని ఫుట్‌బాల్ మైదానం 97 మంది మృతికి సాక్షిగా నిలిచింది. లివర్‌పూల్, నాటింగ్‌హాం మధ్య మ్యాచ్ కోసం స్టేడియం సామర్థ్యానికి మించి ప్రేక్షకులు వచ్చారు. మ్యాచ్ చూసేందుకు చోటు లేకపోవడంతో నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.
- 1996, అక్టోబర్ 16న 84 మంది అభిమానుల మృతితో గ్వాటెమాలా సిటీ వార్తల్లోకెక్కింది. గ్వాటెమాలా, కోస్టారికా మధ్య ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు ఏర్పడ్డ పరిస్థితులు కారణంగా ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో స్టేడియం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు జరిగిన తొక్కిసలాట అభిమానుల జీవితాలను హరించింది.
- 2001, మే9న ఘనా రాజధాని అక్రాలోని మైదానంలో జరిగిన తొక్కిసలాటలో 120 మందికి పైగా అభిమానులు మరణించారు. అక్రా హార్ట్స్, అసంటే కొటోకొ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు మైదానంలోకి నీళ్ల సీసాలు విసిరారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో జరిగిన తొక్కిసలాట అభిమానులు ప్రాణాలు తీసింది.
- కీ.శ 27లో..కీ.శ 27లో రోమ్ సమీపంలోని ఫిడేనియాలోని ఓ మైదానంలో జరిగిన ప్రమాదంలో 20 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతారు. గ్లాడిటోరియల్ క్రీడల సందర్భంగా చెక్క థియేటర్ కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత క్రీ.శ 140లో రోమ్‌లో ఓ చెక్క స్టాండు కూలిపోవడంతో 1100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది.
- ఇప్పటికీ మిస్టరీనే!..యూకేలోని ఫుట్‌బాల్ మైదానాల్లో జరిగిన ప్రమాదాల్లో కెల్లా హిల్స్‌బర్గ్ ఘటన చాలా భయంకరమైనది. ఎంతమందికి గాయాలయ్యాయో ఇప్పటివరకు కచ్చితంగా తెలియదు. దాదాపు 30 ఏళ్లపాటు ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణ చేపట్టింది. అది 1989, ఏప్రిల్ 15. హిల్స్‌బర్గ్ వేదికగా లివర్‌పూల్-నాటింగ్‌హాం జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పరిమితికి మించి ప్రేక్షకులు మైదానానికి వచ్చేశారు. సరిపడా చోటు లేకపోవడంతో వారంతా మ్యాచ్ నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 96 మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 766 మందికి తీవ్రంగా గాయాలైనట్లు అంచనా. ఈ ఘటనకు గుర్తు చేసుకుంటూ లివర్‌పూల్ జట్టు ఆటగాళ్లు ఇప్పటికీ వారి జర్సీ కాలర్‌పై 96 నెంబర్‌ను ముద్రించుకుంటారు.
- ఇదీ చూడండి: స్టేడియంలో ఫ్యాన్స్ గొడవ.. 125 మంది దుర్మరణం
Last Updated : Oct 3, 2022, 8:11 AM IST