మంగళవారం (ఆగస్టు 24) నుంచి టోక్యో పారాలింపిక్స్ క్రీడలు ప్రారంభంకానున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 54 మంది అథ్లెట్లను బరిలో దింపుతోంది భారత్. ఆర్చరీ, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్ ఇలా మొత్తం 9 క్రీడల్లో ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్‌లో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
పారాలింపిక్స్ కోసం టోక్యో వెళ్తున్న భారత బృందం రియో ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు గెలిచిన మరియప్పన్, దేవేంద్రతో పాటు తమ విభాగాల్లో ప్రపంచ రికార్డులు సాధించిన సందీప్ చౌదరి, సుమిత్ లాంటి వాళ్లు ఈ క్రీడలకు వెళ్తున్నారు.
పతకాలు వచ్చే ఛాన్స్ ఎక్కువే..
పారాలింపిక్స్‌లో ఎఫ్-52 కేటగిరీలో బరిలోకి దిగిన డిస్కస్ త్రో అథ్లెట్ వినోద్ కుమార్.. అదే కేటగిరీలో కొనసాగనున్నాడు. దీనిపై పారా అథ్లెటిక్స్ ఛైర్పర్సన్ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్-52లో కొనసాగడం వల్ల పతకం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే, జావెలిన్ త్రో అథ్లెట్ తేక్చాంద్.. ఎఫ్-54 కేటగిరీ నుంచి ఎఫ్-55కు రీక్లాసిఫై అయ్యాడు. కేటగిరీ మారడం వల్ల తేక్చాంద్కు పోటీ కష్టతరం అవుతుందని పారా అథ్లెటిక్స్ ఛైర్పర్సన్ అభిప్రాయపడ్డారు. కానీ తేక్చాంద్ మెరుగైన ప్రదర్శనే చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
అసలు ఏంటీ కేటగిరీలు?
పారాలింపిక్స్‌లో ఆటగాడి వైకల్యం, సామర్థ్యానికి సమఉజ్జీవులుగా ఉన్న వారితోనే పోటీ నిర్వహించేందుకు ఈ కేటగిరీ పద్ధతిని ఏర్పాటు చేశారు. ట్రాక్, మారథాన్, జంపింగ్‌కు సంబంధించిన క్రీడలను 'టీ' కేటగిరీగా గుర్తిస్తారు. ఫీల్డ్‌కు సంబంధించిన క్రీడలకు 'ఎఫ్' కేటగిరీగా గుర్తిస్తారు. సాధారణంగా కేటగిరీ సంఖ్య ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ వైకల్యం ఉన్నట్టు పరిగణిస్తారు.
అథ్లెట్లకు మొత్తం టీ/ఎఫ్ 51, టీ/ఎఫ్ 52, టీ/ఎఫ్ 53, టీ/ఎఫ్54, టీ/ఎఫ్55, టీ/ఎఫ్ 57 కేటగిరీలు ఉంటాయి.
ఇదీ చదవండి :Paralympics: వైకల్యాన్ని జయించి.. విశ్వ క్రీడలకు కదిలి