Tennis Star Marriage Proposal: ఇటాలియన్ టెన్నిస్ స్టార్ మాటియో బెరెట్టిని ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఏటీపీ 500 క్వీన్స్ క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో డచ్‌కు చెందిన బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్‌పై 6-4, 6-3 తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టాడు. గ్రాస్ కోర్టులో బెరెట్టిని చివరగా ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఇది 19వ విజయం కావడం విశేషం. ఆ ఓడిన ఒక్క మ్యాచ్ కూడా 2021 వింబుల్డన్ ఫైనల్. దాంట్లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ చేతిలో బెరెట్టిని పరాజయం పాలయ్యాడు.
ఇదిలా ఉండగా.. శనివారం జరిగిన సెమీస్‌లో విజయం సాధించిన అనంతరం బెరెట్టిని ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అతడికి వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఒక యువతి.. 'మాటియో.. నన్ను పెళ్లి చేసుకుంటావా' అని గట్టిగా అరిచింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన బెరెట్టిని రెండు క్షణాల తర్వాత చిరునవ్వుతో 'ఈ విషయం గురించి ఆలోచించి చెబుతా' అని అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆదివారం జరిగే ఫైనల్లో బెరెట్టిని సెర్బియాకు చెందిన ఫిలిప్ క్రాజినోవిక్‌తో తలపడనున్నాడు.