Telangana shooter Deaflympics Gold: బధిర ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో భారత షూటర్లు సత్తా చాటారు. ఒకే విభాగంలో రెండు పతకాలు కైవసం చేసుకున్నారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ రౌండ్లో.. షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం సాధించాడు. మరో షూటర్ శౌర్య సైనీ ఇదే విభాగంలో కాంస్యం గెలుచుకున్నాడు. ధనుష్ 247.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. కొరియాకు చెందిన కిమ్ వూ రిమ్ 246.6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. శౌర్య సైనీ 224.3 పాయింట్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకొని కాంస్యం పట్టేశాడు.
ధనుష్ శ్రీకాంత్ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం విశేషం. హైదరాబాద్లోని గగన్ నారంగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. నారంగ్ ట్రైనింగ్లో రాటుదేలిన ధనుష్.. తాజా ఒలింపిక్స్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో ధనుష్ రెండో స్థానంలో నిలవగా.. ప్రధాన రౌండ్లో మరింత రెచ్చిపోయి పసిడిని ముద్దాడాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోచ్లు అనుజ జంగ్, ప్రీతి శర్మ సైతం ధనుష్, శౌర్యకు శిక్షణ ఇచ్చారు.