Arjun Erigaisi: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి పాల్గొనడంతో పాటు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి. ఒలింపియాడ్‌లో పోటీపడడం జీవిత కాల అనుభవం అని.. 2700 ఎలో రేటింగ్‌ను అందుకుని సూపర్ గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగిన ఈ 18 ఏళ్ల కుర్రాడు అంటున్నాడు. తమ జట్టుకు పతకం దక్కితే బాగుండేదని.. అయినప్పటికీ ఈ టోర్నీ అనుభవం ఎంతో అమూల్యమైందని ఈ వరంగల్ ఆటగాడు తెలిపాడు. వ్యక్తిగత రజతం నెగ్గిన అతను.. ఈ పోటీల అనుభవాలను పంచుకున్నాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..!
'ఓ దశలో ఓడిపోతానేమోనని అనుకున్నా'
"మొట్టమొదటి సారి చెస్ ఒలింపియాడ్‌కు భారత్ గొప్పగా ఆతిథ్యమిచ్చింది. సొంతగడ్డపై ఈ ప్రతిష్ఠాత్మక చెస్ సమరంలో దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నానని తెలిసినప్పుడు సంతోషపడ్డా. పోటీల కోసం ఆత్రుతగా ఎదురు చూశా. టోర్నీ ఓపెన్ విభాగంలో అగ్రశ్రేణి జట్టుతో కలిసి ఆడడం మంచి అనుభవం. హరికృష్ణ, విదిత్ సంతోష్, ఎస్ఎల్ నారాయణన్, శశికిరణ్ లాంటి ఉత్తమ ఆటగాళ్లతో దేశం తరపున పోటీపడడం గొప్పగా అనిపించింది. రెండో సీడ్‌గా బరిలో దిగడంతో మా జట్టుపై పతక అంచనాలు ఏర్పడ్డాయి. అందరూ 2600 ఎలో రేటింగ్ దాటిన ఆటగాళ్లే కావడంతో కాగితం మీద జట్టు బలంగా కనిపించింది. ఊహించినట్లుగానే మాకు మంచి ఆరంభం దక్కింది. ఏడో రౌండ్ వరకూ అజేయంగా సాగాం."
"అయిదు రౌండ్లలో నెగ్గిన మేము.. మరో రెండు డ్రా చేసుకున్నాం. ఎనిమిదో రౌండ్లో అర్మేనియా చేతిలో ఓటమి దెబ్బతీసింది. అంతకుముందు ఆరో రౌండ్లోనూ ఉజ్బెకిస్థాన్‌తో డ్రాకు బదులు విజయం వరించి ఉంటే పతకం దక్కేందుకు మెరుగైన అవకాశాలు ఉండేవి. అర్మేని యాపై గెలిచినా.. ఫలితం మరోలా ఉండేది. ఏ ప్రత్యర్థితో ఎవరు తలపడాలనేది కొంచెం భిన్నంగా ఉంటే పరిస్థితులు మాకు కలిసి వచ్చేవేమో అనుకుంటున్నా. జట్టు పరంగా చూసుకుంటే అర్మేనియాతో పోరు కఠినంగా సాగింది. వ్యక్తిగతంగా అయితే ఉజ్బెకిస్థాన్ ఆటగాడు సిందరోవ్‌తో గేమ్ సవాలుగా అనిపించింది. ఓ దశలో ఓడిపోతానేమోనని అనుకున్నా. కానీ పట్టు వదలకుండా డ్రా చేసుకోగలిగా." అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.
"అసలే చెస్ ఒలింపియాడ్.. పైగా స్వదేశంలో జరుగుతుంది కాబట్టి భారత ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉండడం సహజం. దాన్ని దూరం చేసుకునేందుకు మేం సరదాగా టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ లాంటి క్రీడలు ఆడేవాళ్లం. జట్టు మధ్య మంచి సమన్వయం ఏర్పడింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరం స్నేహితులుగా కలిసిపోయాం. హరికృష్ణ నాకు సూచనలు ఇచ్చాడు. ఈ టోర్నీలో టీమ్ పరంగా చూసుకుంటే నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయాం. పతకం దక్కితే ఇంకా బాగుండేది. కానీ వ్యక్తిగతంగా నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. 11 రౌండ్లు ముగిసే సరికి అజేయంగా నిలవడం ఆనందంగా ఉంది. ఆరు గేమ్‌లు గెలిచిన నేను.. మరో అయిదు డ్రా చేసుకున్నా. దీంతో వ్యక్తిగత రజతం దక్కింది. ఒక్కో రౌండ్లో 1 నుంచి 5 బోర్డులపై ఆటగాళ్లు తలపడతారు. నేను టోర్నీ సాంతం మూడో బోర్డు మీద ఆడా. ఇలా ఒక్కో బోర్డు పరంగా అత్యధిక పాయింట్లు గెలుచుకున్న వాళ్లకు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇచ్చారు. మూడో బోర్డులో ఇంగ్లాండ్ ఆటగాడు హావెల్ డేవిడ్‌కు పసిడి, మన ప్రజ్ఞానందకు కాంస్యం వచ్చింది. ఇలాగే తొలి బోర్డులో గుకేశ్, రెండో బోర్డులో నిహాల్ మొదటి స్థానాల్లో నిలిచారు."