Mens Asia Cup Junior Hockey 2023 : జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు తన జోరును కొనసాగిస్తోంది. టైటిల్‌ను నిలబెట్టుకుంటూ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరోసారి మైదానంలో అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థైన పాకిస్థాన్‌ను చిత్తుచేసి.. నాలుగో టైటిల్‌తో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీని గెలుపొందిన జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతో మూడు టైటిళ్లను గెలుచుకున్న పాక్ రెండో స్థానానికి పరిమితమైంది. గురువారం జరిగిన ఫైనల్లో భారత్ 2-1 తేడాతో పాక్‌పై ఘన విజయాన్ని సాధించింది. అంగద్ వీర్ సింగ్ (13వ నిమిషంలో), అరిజీత్ సింగ్ (20వ) చెరో గోల్‌తో తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ప్రత్యర్థి తరపున అలీ బషారత్ (38వ) గోల్ కొట్టాడు. ఈ టోర్నీలో అజేయంగా సాగిన భారత్.. తుదిపోరులోనూ అదే జోరును కొనసాగించింది. పూల్ దశలో పాక్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న ఇండియా కుర్రాళ్లు.. ఆఖరి సమరంలో మాత్రం విజృంభించారు. కాగా 2004, 2008, 2015లో ఇండియా విన్నర్‌గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2-1 స్కోర్‌తో మలేసియాపై గెలిచింది
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత జట్టు.. తొలి నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ సాధించినప్పటికీ.. దాని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. ఆరో నిమిషంలో దక్కిన మరో పెనాల్టీ కార్నర్‌ను పాక్ గోల్‌కీపర్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత దాడులను భారత్ మరింత ఉద్ధృతం చేసింది. ఎట్టకేలకు అంగద్ గోల్‌తో మన జట్టు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. రెండో క్వార్టర్‌లో భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ఈ సారి అరిజీత్ ఫీల్డ్‌గోల్‌తో భారత్ ఆధిక్యం రెట్టింపైంది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని దాటుకుని అతను బంతిని గోల్‌పోస్టు లోపలికి పంపించాడు.