తెలంగాణ

telangana

ETV Bharat / sports

మేటి షట్లర్​గా భారత యువకెరటం.. ప్రపంచ నంబర్​-1గా ఎదిగి..

Tasnim Mir Badminton: గుజరాత్​కు చెందిన 16 ఏళ్ల షట్లర్ అండర్-19 మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌-1గా ఎదిగింది. ఒలింపిక్స్​లో పతకాలు సొంతం చేసుకున్న సైనా నెహ్వాల్, పీవీ సింధుకు కూడా సాధ్యం కాని ఘనతను సాధించింది. ఆమే తస్నిమ్ మిరా. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

tasnim
తస్నిమ్‌

By

Published : Jan 14, 2022, 7:04 PM IST

Tasnim Mir Badminton: భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఇప్పటివరకూ మనమెంతో ఘనంగా చెప్పుకొనే క్రీడాకారులు.. ప్రకాశ్‌ పదుకొణె, పుల్లెల గోపీచంద్‌, పారుపల్లి కశ్యప్‌, సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, లక్ష్యసేన్‌ మాత్రమే. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిన యువ కెరటం తస్నిమ్‌ మిర్‌. గుజరాత్‌కు చెందిన ఈ 16 ఏళ్ల షట్లర్‌.. అండర్‌-19 మహిళల సింగిల్స్‌ విభాగంలో తాజాగా ప్రపంచ నంబర్‌-1గా ఎదిగింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించిన సైనా నెహ్వాల్‌, పీవీ సింధు లాంటి మేటి షట్లర్లకు కూడా వీలుకాని ఘనత తస్నిమ్‌ సాధించింది.

  • తస్నిమ్‌గతేడాది జూనియర్‌ స్థాయి అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. బల్గేరియా, ఫ్రాన్స్‌, బెల్జియంలలో జరిగిన ఈ మెగా టోర్నీల్లో సత్తా చాటి సింగిల్స్‌ విభాగంలో మూడు ర్యాంకులు ఎగబాకింది. దీంతో ఆమె అండర్‌-19 స్థాయిలో ప్రపంచ నంబర్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ జూనియర్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. అందులో తస్నిమ్‌10,810 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
  • భారత మహిళల బ్యాడ్మింటన్‌ చరిత్రలో సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఎంతటి మేటి షట్లర్లో అందరికీ తెలిసిందే. సైనా ఒలింపిక్స్‌లో ఓ పతకం సాధించగా సింధు రెండు పతకాలు కైవసం చేసుకొంది. దీంతో ఈమె భారత ఒలింపిక్స్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ ఇద్దరు దిగ్గజాలకు కూడా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధ్యంకాలేదు. 2011లో జూనియర్‌ ర్యాంకింగ్స్‌ విభాగం ప్రవేశ పెట్టగా అప్పటికే సైనా అండర్‌-19 స్థాయి దాటిపోయింది. మరోవైపు సింధు ఈ విభాగంలో నంబర్‌-2 ర్యాంక్‌తోనే సరిపెట్టుకుంది.
  • తస్నిమ్‌ తొలి గురువు తన తండ్రి ఇర్ఫాన్‌ మిర్‌. ఆయనో బ్యాడ్మింటన్‌ కోచ్‌. అలాగే మెహ్‌సానా పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగానూ పని చేస్తున్నారు. బ్యాడ్మింటన్‌లో ఆమె తొలి అడుగులు వేసింది ఆయన పర్యవేక్షణలోనే. అయితే, గత నాలుగేళ్లుగా అసోం బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఇండోనేషియన్‌ కోచ్‌ ఎడ్విన్‌ ఇరియావాన్‌తో శిక్షణ పొందింది. అంతకుముందు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలోనూ తన ఆటకు మెరుగులు దిద్దుకోవడం విశేషం.
    తస్నిమ్‌

అస్సలు ఊహించలేదు..

"నేనెప్పుడూ ప్రపంచ నంబర్‌-1 అవుతానని అనుకోలేదు. గతేడాది నంబర్‌-2లో ఉన్నాను. ఈ క్రమంలోనే కరోనా కారణంగా 2021లో టోర్నీలు పూర్తిస్థాయిలో జరుగుతాయో లేదో అని భయపడేదాన్ని. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడంతో చాలా సంతోషంగా ఉంది. నా ఫేవరెట్‌ షట్లర్లు సింధు, సైనా ఎలా ఆడారో.. వాళ్లలాగే నేనూ రాణించాలనుకుంటున్నా. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పతకం తేవాలనుకుంటున్నా. దీంతో ఇప్పుడు సీనియర్లు ఎలా ప్రాక్టీస్‌ చేస్తున్నారో తెలుసుకొని వాళ్లలాగే ఆడాలని ఉంది' అని నంబర్‌-1 ర్యాంక్‌ సాధించిన అనంతరం తస్నిమ్‌మీడియాతో తెలిపింది.

తస్నిమ్‌ ఘనతలు..

  • 2018లో తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించిన ఆల్‌ ఇండియా సబ్‌ జూనియర్‌ టోర్నీల్లో అండర్‌-15 సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. అలాగే నాగ్‌పూర్‌లో నిర్వహించిన అండర్‌-17 విభాగంలోనూ డబుల్స్‌లో టైటిల్‌ సొంతం చేసుకుంది.
  • 2018లో రాయ్‌పూర్‌లో నిర్వహించిన అండర్‌-15, అండర్‌-17 విభాగాల్లో సింగిల్స్‌ టైటిల్స్‌ కైవసం చేసుకుంది.
  • 2018లో ఆసియా జూనియర్‌ అండర్‌-17, అండర్‌-15 ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్ సాధించింది.
  • 2019లో దుబాయ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌లో టైటిల్‌ విజేతగా నిలిచింది.
  • 2020లో నేపాల్‌లో జరిగిన జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌, డబుల్స్‌లో విజేతగా నిలిచింది.
  • 2021లో బెల్జియం, ఫ్రాన్స్‌, బల్గేరియాలోనూ సింగిల్స్‌ విజేతగా నిలిచింది.

ఇదీ చదవండి:

PV Sindhu India Open: సెమీస్​లోకి దూసుకెళ్లిన పీవీ సింధు

India Open 2022: సింధు క్వార్టర్స్​లోకి.. సైనా ఔట్

ABOUT THE AUTHOR

...view details