అప్పుడెప్పుడో 50 ఏళ్ల క్రితం మీర్ ఖాసిమ్ అలీ రజతం సాధించాక జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు గడ్డ నుంచి పతకం గెలిచిన క్రీడాకారులే లేరు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హైదరాబాద్ యువ ప్లేయర్లు ఫిదెల్ ఆర్.స్నేహిత్, శ్రీజ ఆకుల ఇటీవలే హరియాణాలోని పంచకులలో ముగిసిన ఛాంపియన్‌షిప్‌లో చెరో కాంస్యం గెలిచారు. తమ కష్టమే సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు తెచ్చిపెట్టిందంటూ ఈ ఛాంపియన్లు 'ఈనాడు'తో చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే..
"సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించే క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ హర్మీత్ దేశాయ్‌తో పాటు.. భారత టాప్-12లో ఎంతోకాలంగా ఉంటున్న సౌరభ్ సాహా, సుష్మిత్ శ్రీరామ్ లాంటి ఆటగాళ్లను ఓడించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన సత్యన్‌తో సెమీస్‌లో ఓడడం కాస్త బాధ కలిగించినప్పటికీ.. నా ప్రయత్నం పట్ల సంతృప్తిగా ఉన్నా. జూనియర్, యూత్ విభాగాల్లో ఇప్పటికే ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ.. సీనియర్ స్థాయిలో ఇదే తొలి పతకం. సీనియర్ స్థాయిలో శరత్ కమల్, సత్యన్, హర్మీత్, మానవ్ థక్కర్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు తలపడతారు. అలాంటి టోర్నీలో పతకం సొంతం చేసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. వచ్చే నెలలో యూత్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నా. లాక్‌డౌన్ సమయంలో యూత్ నుంచి సీనియర్ స్థాయికి ఎలా ఎదగాలనే విషయంపై దృష్టి పెట్టా. నా శక్తిని పెంచుకోవడం సహా నా బలాలను మెరుగుపర్చుకున్నా. ఈ స్థాయిలో ఫిట్‌నెస్ చాలా కీలకం కాబట్టి రోజూ దాని మీద పని చేశా. అది ఫలితాన్నిచ్చింది. ఈ పతకంలో కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌ది కీలక పాత్ర. నా అంతిమ లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే".
-స్నేహిత్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు
"సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో తొలి పతకం ఇచ్చిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. జూనియర్, యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇప్పటికే ఎన్నో పతకాలు గెలిచినప్పటికీ.. ఈ విజయం ఇచ్చే కిక్కు వేరు. సెమీస్ చేరే క్రమంలో దివ్య పరాగ్, ప్రాప్తి సేన్‌పై విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అయితే సెమీస్‌లో మనిక బత్రాతో పోరులో శక్తిమేరకు ప్రయత్నించినా ఫలితం అనుకూలంగా రాలేదు. గతంలో తనపై నేను విజయాలు సాధించినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయా. ప్రస్తుతం రెండు అంతర్జాతీయ టోర్నీల కోసం ఖతార్‌కు వచ్చా. ఈ టోర్నీల్లో ప్రపంచస్థాయి ప్లేయర్లపై విజయాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నా. యూత్ నుంచి సీనియర్ విభాగంలోకి మారడం కష్టంతో కూడుకున్న పని. అప్పటివరకూ పోటీ ఒకలా ఉంటే.. ఆ తర్వాత అంతకుమించి ఉంటుంది. అత్యున్నత స్థాయి పోటీల్లో ఉండే ఒత్తిడిని తట్టుకునేందుకు లాక్‌డౌన్‌లో అధిక సమయం యోగాకు కేటాయించా. దాంతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టా. ఇలాగే సీనియర్ స్థాయిలో రాణించి భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించాలి. ఒలింపిక్స్‌లో ఆడాలనే కలను నిజం చేసుకోవాలి.