తెలంగాణ

telangana

ETV Bharat / sports

Syed Modi International 2022:  సింధు టైటిళ్ల కరవు తీరేనా!

Syed Modi International 2022: సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌ టోర్నీ మంగళవారం(జనవరి 18) నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. అంతర్జాతీయ స్థాయిలో టైటిళ్ల కరవుకు తెరదించాలని భావిస్తోంది. మరోవైపు.. సైనా, లక్ష్యసేన్‌, సాత్విక్‌ జోడీ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగారు.

PV Sindhu
పీవీ సింధు

By

Published : Jan 18, 2022, 7:02 AM IST

Syed Modi International 2022: రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. ఇండియా ఓపెన్‌లో ఊహించని ఓటమితో కంగుతిన్న ఆమె.. మంగళవారం(జనవరి 18) ఆరంభమయ్యే సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. అంతర్జాతీయ స్థాయిలో టైటిళ్ల కరవుకు తెరదించాలని భావిస్తోంది. నిరుడు స్విస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో ఫైనల్‌ చేరిన సింధు.. ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో తాన్యా హేమంత్‌తో టాప్‌ సీడ్‌ సింధు తలపడుతుంది.

మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించని కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మెరిసి.. ఆదివారం ఇండియా ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకున్న యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ కూడా ఈ పోటీల నుంచి తప్పుకున్నాడు. "ఇండియా ఓపెన్‌ ముగిసిన తర్వాత బాగా అలసిపోయా. ఈ టోర్నీలో నా ఆటకు న్యాయం చేయలేనన్న భయంతో ఉన్నా. కోచ్‌లు, ఫిజియోలు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా" అని లక్ష్యసేన్‌ తెలిపాడు.

ఇండియా ఓపెన్‌లో టైటిల్‌ సాధించిన భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి సైతం టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇండియా ఓపెన్‌లో పాజిటివ్‌గా తేలిన భారత స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండటంతో ఈ టోర్నీలో ఆడలేకపోతున్నాడు. కరోనా నుంచి కోలుకుంటున్న డబుల్స్‌ ప్లేయర్లు అశ్విని పొన్నప్ప, మను అత్రిలతో పాటు సాయి ప్రణీత్‌ కూడా బరిలో దిగే అవకాశం లేదు.

ABOUT THE AUTHOR

...view details