Sumit Nagal Kohli : భారత టెన్నిస్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో(Australian Open 2024) అద్భుత ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించాడు. మూడేళ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించిన ఈ ప్లేయర్ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మొదటి రౌండ్‌లో దిగ్గజ ప్లేయర్ 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)ను 6-4, 6-2, 7-6 (7-5)తో ఓడించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ హిస్టరీలో దాదాపు మూడున్నార దశాబ్దాల తర్వాత ఓ సీడెడ్ ఆటగాడిని భారత ప్లేయర్ ఓడించడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
అయితే తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అండగా నిలిచాడని సుమిత్ నగాల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. "2017 నుంచి కోహ్లీ ఫౌండేషన్ నాకు మద్దతు ఇస్తోంది. గత రెండేళ్లుగా బాగా ఆడలేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. విరాట్ మద్దతు ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఈ ఏడాది(2019) ప్రారంభంలో ఓ టోర్నమెంట్ ముగిసిన తర్వాత కెనడా నుంచి జర్మనీకి విమానంలో ప్రయాణించాను. అప్పుడు నా వాలెట్‌లో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ, వాటి నుంచి బయటపడ్డాను. పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అథ్లెట్లకు నిధులు సమకూరిస్తేనే దేశంలో క్రీడా రంగం డెవలప్ అవుతుంది. కోహ్లీ నుంచి మద్దతు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని సుమిత్ అన్నాడు.
ఇకపోతే 2023లోనూ ఓ ఇంటర్వ్యూలో నగాల్ తన ఆర్థిక కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ఏటీపీ టూర్‌లో పాల్గొనడానికి సూమారు రూ. కోటి అవసరమైనప్పుడు తన అకౌంట్‌లో రూ.80,000 మాత్రమే ఉన్నాయని అన్నాడు.