తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉమెన్స్ డే: ఈ 'అమ్మ'లకు ఎవరూ సాటిరారు! - lindsay davenport

వివాహం అయితే తమ కెరీర్​ ముగిసిపోయిందని చాలామంది మహిళలు వాపోతారు. తమ లక్ష్యాలు, ఆశయాలు ఆవిరి అయిపోయాయని ఎంతో కలత చెందుతారు. పిల్లలను కనడం వారిని ప్రయోజకులను చేయడమే తమ పని అనుకుంటారు. కానీ పెళ్లిళ్లు అయి, పిల్లలకు తల్లులైన తర్వాత కూడా వారు అనుకున్నది సాధించవచ్చని ఎంతో మంది అతివలు నిరూపించారు. వారు ఎవరు? వారికే ఎలా సాధ్యమైంది? మహిళా దినోత్సవం నాడు మీకోసం ఈ ప్రత్యేక కథనం.

story on female athletes who are actually mothers
ఉమెన్స్ డే: ఈ 'అమ్మ'లకు ఎవరూ సాటిరారు!

By

Published : Mar 8, 2021, 5:42 AM IST

పెళ్లైపోతే అంతే.. ఇక కష్టం.. కెరీర్‌కు తెరపడినట్లే. ఇలాంటి ఆలోచనలు ఈ అథ్లెట్లను చూస్తే పటాపంచలవుతాయి. కెరీర్‌లో మంచి స్థితిలో ఉన్నా.. వివాహం చేసుకుని, పిల్లల్ని కని మళ్లీ ఆటలో మెరిసిన క్రీడాకారిణులు కొందరున్నారు. మరి వారెవరో చూద్దామా..

పతకాల పంట పండించిన మేరీకోమ్​..

అమ్మయిన తర్వాత ఛాంపియన్‌గా నిలిచిన వారి జాబితాలో ముందుంటుంది భారత నారి మేరీకోమ్‌. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టిన మేరీ.. నింగ్బో (చైనా, 2008), బ్రిడ్జిటౌన్‌ (2010) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు గెలిచింది. అన్నిటికంటే హైలైట్‌ ఏమిటంటే 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలవడం. 2010, 14 ఆసియా క్రీడల్లోనూ ఆమె పతకాలు సాధించింది.

బాక్సర్​ మేరీ కోమ్​

ఒలింపిక్స్‌లో పతకం కొట్టినా ఆమె ఆగలేదు. మరోసారి ఈ మెగా ఈవెంట్లో పతకమే లక్ష్యంగా బరిలో నిలిచింది. ఇటీవలే జరిగిన బాక్సమ్​ అంతర్జాతీయ బాక్సింగ్​ టోర్నీలో రజత పతకాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్​ లక్ష్యంగా కఠినంగా శ్రమిస్తోంది.

టెన్నిస్‌ అమ్మలు

కిమ్‌ క్లియ్‌స్టర్స్‌, లిండ్సె డావెన్‌పోర్ట్‌ ఇద్దరికి పోలికలు ఉన్నాయి. ఇద్దరూ టెన్నిస్‌ క్రీడాకారిణులే. అంతేకాక అమ్మ అయిన తర్వాత తిరిగొచ్చి టైటిళ్లు సాధించడం. 2007లో ఆటకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన క్లియ్‌స్టర్స్‌.. 2009లో పునరాగమనం చేసింది. వచ్చి రెండు టోర్నీలు ఆడిందో లేదో యూఎస్‌ ఓపెన్‌ గెలిచేసింది.

కిమ్‌ క్లియ్‌స్టర్స్‌

అయితే, ఆమె అక్కడితో ఆగలేదు. 2010లో మరోసారి యూఎస్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న ఈ బెల్జియం స్టార్‌.. 2011లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌నూ ఖాతాలో వేసుకుంది. ఇక అమెరికా తార డెవన్‌పోర్ట్‌ గర్భం దాల్చినా టోర్నీలు ఆడింది. అంతేకాదు ఆ సమయంలో ఆమె నాలుగు టోర్నీల్లో మూడింట్లో విజేతగా నిలిచింది. 2007లో ప్రసవించిన ఆమె ఆ తర్వాత డబ్ల్యూటీఏ టైటిళ్లు సాధించింది. అంతేకాక 2008లో బీజింగ్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌ వరకు వెళ్లింది.

పతకం కోసం మళ్లీ..

జెస్సికా ఇనీస్‌ హిల్‌

జెస్సికా ఇనీస్‌ హిల్‌.. ఈ బ్రిటన్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ తల్లి అయిన తర్వాత కూడా ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించింది. 2012 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో హెప్టాథ్లాన్‌లో స్వర్ణం గెలిచిన జెస్సికా.. అదే ఏడాది తల్లి అయి కామన్వెల్త్‌ క్రీడలకు దూరమైంది. కానీ ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలే మళ్లీ ఆమెను ట్రాక్‌ మీదకు తీసుకొచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో జెస్సికా పసిడి గెలవకపోయినా.. రజతం సాధించి అబ్బురపరిచింది.

సెరెనా..వచ్చేసింది..

అందరూ ఒక ఎత్తు.. అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ మరో ఎత్తు. 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచి ఓపెన్‌ శకంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సెరెనా.. కొన్నేళ్ల క్రితం అమ్మ అయింది. బిడ్డకు జన్మనిచ్చాక అతికష్టమ్మీద బతికానని చెప్పిన ఆమె.. సుదీర్ఘ విరామం తర్వాత ఇండియన్‌వెల్స్‌ టోర్నీలో ఆడి శుభారంభం చేసింది.

టెన్నిస్​ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్​

ఇప్పుడు సెరెనా ముందున్న లక్ష్యం ఒక్కటే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన మార్గరేట్‌ కోర్ట్‌ (24 టైటిళ్లు) రికార్డును అధిగమించడం. ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సెమీఫైనల్​లో ఒసాకాతో జరిగిన పోటీలో సెరెనా విలియమ్స్​ ఓటమి పాలైంది. ఫ్రెంచ్​ ఓపెన్​లోనైనా ట్రోఫీ నెగ్గి మార్గరేట్ కోర్ట్​ రికార్డును సమం చేసేందుకు పట్టుదలతో శ్రమిస్తోంది.

బిడ్డ పుట్టిన 10 రోజులకే

ఐర్లాండ్‌ అథ్లెట్‌ సోనియా సులెవాన్‌ది అందరి కంటే భిన్నమైన కథ. 1999లో ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆమె 10 రోజులకే మళ్లీ ట్రాక్‌లో అడుగుపెట్టి అందర్ని ఆశ్చర్యపరిచింది. చాలా కష్టమైనా శిక్షణ శిబిరంలో పాల్గొంది.

సోనియా సులెవాన్‌ది

ఇంతటి పట్టుదల, శ్రమ ఉంది కాబట్టే ఆమె 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 5000 వేల మీటర్ల పరుగులో రజతం సాధించగలిగింది. 10 వేల మీటర్ల పరుగులోనూ ఆమె చివరిదాకా పతకం రేసులో నిలిచినా 6వ స్థానంతో సరిపెట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details