తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెరీర్​పై సానియా మీర్జా కీలక నిర్ణయం! - కోచ్​గా టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా

Sania Mirza Retirment: ఇటీవలే రిటైర్మెంట్​ నిర్ణయం ప్రకటించి అభిమానులను షాక్​కు గురి చేసిన భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా.. వీడ్కోలు చెప్పిన తర్వాత కూడా ఆటతో అనుబంధాన్ని కొనసాగిస్తానని చెప్పింది. కోచ్‌ లేదా వ్యాఖ్యాతగా అయ్యే అవకాశాలున్నాయి తెలిపింది.

sania mirza
సానియా మీర్జా రిటైర్మెంట్​

By

Published : Feb 2, 2022, 7:26 AM IST

Updated : Feb 2, 2022, 8:35 AM IST

Sania Mirza Retirment: అయిదేళ్లకే రాకెట్‌ పట్టింది. 15 ఏళ్లకే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అడుగుపెట్టింది. సుదీర్ఘ కాలంగా ఆటలో కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలు, మరెన్నో ఒడుదొడుకులు, అనేక వివాదాలు.. వీటన్నింటినీ అధిగమించి డబుల్స్‌లో నంబర్‌వన్‌గా ఎదిగింది. కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకుంది. భారత టెన్నిస్‌లో మరే క్రీడాకారిణి అందుకోని ఘనతల్ని సొంతం చేసుకుంది. సానియా మీర్జా ఘన ప్రస్థానమిది. సుదీర్ఘ ప్రయాణం తర్వాత 35 ఏళ్ల సానియా టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది. తన కెరీర్‌లో ఇదే చివరి సీజన్‌ అని ప్రకటించింది. అద్వితీయ ఘనతలతో భారత్‌లో ఎంతోమంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలిచిన సానియా తన క్రీడా ప్రస్థానం గురించి పంచుకున్న విశేషాలివీ..

సానియా ఈ స్థితిలో ఉండటానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది?

భారతీయ మహిళలు ఎన్నో రంగాల్లోకి ప్రవేశించి విజయవంతమయ్యారు. కానీ తమను శక్తిగా పరిగణించని కొన్ని రంగాల్లో అడుగుపెట్టలేదు లేదా పూర్తిస్థాయిలో దృష్టిసారించలేదు. అందులో టెన్నిస్‌ కూడా ఒకటి. టెన్నిస్‌లో అంతర్జాతీయ వేదికలపై భారతీయ మహిళలు సత్తాచాటగలరని నా దేశంతో పాటు మిగతా ప్రపంచ ప్రజలకు నిరూపించడమే నేను ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు. ఆ సవాలును విజయవంతంగా అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నా.

సుమారు 30 ఏళ్ల పాటు ప్రతిరోజూ ఉదయాన్నే శిక్షణకు వెళ్లడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఏమిటి?

ఆటపై ఇష్టమే నాకు ప్రేరణ. ఎన్ని గాయాలైనా.. ఎన్ని శస్త్రచికిత్సలు జరిగినా ఆటపై మక్కువే నన్ను ఇన్నేళ్లుగా నడిపిస్తుంది. ఎంతో ఇష్టమైన క్రీడలో నా దేశం కోసం రాణించాలనే ఉత్సాహం నన్ను కష్టపడి పనిచేసేలా చేసింది. ప్రతిరోజూ ఉదయం టెన్నిస్‌ రాకెట్‌ పట్టేలా స్ఫూర్తినింపింది.

క్రీడాకారిణిగా, భార్యగా, తల్లిగా మీ బలాలు ఏంటి?

ఒకసారి లక్ష్యాలను నిర్దేశించుకుంటే సాధించే వరకు వదిలిపెట్టను. అందుకోసం నా శక్తికి మించి ప్రయత్నిస్తా. ఎంత కష్టమైనా మధ్యలో విడిచిపెట్టను. అన్నిటికి మించి నా కుటుంబమే నా బలం.

గొప్ప అథ్లెట్‌గా మారడంలో మీకు కలిసొచ్చిన అంశాలేంటి?

ప్రతిభ, పోరాడేతత్వం, కష్టపడేతత్వం, సత్తా చాటాలన్న తపన, ఆత్మవిశ్వాసం ఉండటం. ఓటమికి కుంగిపోకపోవడం. నిరుత్సాహం నుంచి తిరిగి పుంజుకునే సారమ్థ్యం కలిగి ఉండటం. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించగలగడం.

ప్రొఫెషనల్‌ క్రీడాకారిణిగా మీరు నేర్చుకున్న పాఠం ఏమిటి?

అత్యున్నత స్థాయిలో విజయం సాధించడానికి ఎదురయ్యే కష్టాలను.. సవాళ్లను ఎల్లప్పుడూ ఆస్వాదించాలి. మన శక్తిసామర్థ్యాలపై నమ్మకం ఉండాలి. ఈ రెండూ ఉంటే ఎవరూ ఆపలేరు.

అత్యున్నత స్థాయిలో క్రీడాకారిణిగా కొనసాగడంలో కఠినమైన అంశం ఏమిటి?

సుదీర్ఘ కాలం పాటు ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉండటం అన్నిటికంటే కష్టం. తల్లిగా మారిన తర్వాత ఈ కష్టం రెట్టింపయింది. కుమారుడిని ఇంటి దగ్గర విచిడిపెడితే మనసంతా అతని చుట్టే ఉంటుంది. ఒకవేళ వెంట తీసుకెళ్తే కరోనా మహమ్మారి వెంటాడుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆటను, కుమారుడితో సమయాన్ని సమన్వయం చేసుకోవడం అత్యంత కఠినమైన అంశం.

దేశంలో ఎంతోమంది చిన్నారులు టెన్నిస్‌ రాకెట్‌ పట్టేలా స్ఫూర్తినింపడం.. వారికి మార్గదర్శకంగా నిలవడం ఎలా అనిపిస్తోంది?

ఇలాంటి బాధ్యతల్ని భుజాన మోయడం చాలా ఆనందంగా ఉంది. ఇదో వినయపూర్వకమైన అనుభవం. అలాంటి స్థానంలో ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నా.

ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత కోచ్‌గా, వ్యాఖ్యాతగా కొనసాగే అవకాశాలు ఉన్నాయా?

అవును.. కచ్చితంగా ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. చిన్న పిల్లగా ఉన్నప్పట్నుంచి టెన్నిస్‌ నా జీవితంలో భాగం. ఇంతలా ఆరాధించే క్రీడ నుంచి నన్ను నేను దూరం చేసుకోలేను. నేను కోచ్‌, వ్యాఖ్యాత అయ్యే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం క్రీడాకారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏంటి?

క్రీడాకారులకే కాదు యావత్‌ ప్రపంచానికి కరోనా అతి పెద్ద సవాలుగా మారింది. క్రీడారంగం మునుపెన్నడూ ఎదుర్కోని పరిస్థితిలో చిక్కుకుంది. క్రీడల్లో శారీరక ఫిట్‌నెస్‌తో సమానంగా మానసికంగా ఫిట్‌నెస్‌ అవసరం. సాధన, కసరత్తులతో శారీరక ఫిట్‌నెస్‌ సాధించొచ్చు. మానసిక ఫిట్‌నెస్‌కు ఒక్కొక్కరు ఒక్కో విధానం అనుసరిస్తారు. ఆట తర్వాత ఆహ్లాదం కోసం కొందరు బయటకు వెళ్తారు. మరికొందరు కుటుంబ సభ్యులు, బంధువులతో గడుపుతారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. క్రీడాకారులకు బయో బబుల్‌ తప్పనిసరిగా మారింది. సుదీర్ఘ కాలం బుడగలో ఉంటే మానసికంగా చాలా కష్టమవుతోంది.

యువ క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు మీరిచ్చే సలహాలు, సూచనలేంటి?

ఆసక్తి ఉన్న ఆటను ఎంచుకోవాలి. ప్రతిరోజూ ఇష్టంతో ఆడాలి. ఎంచుకున్న క్రీడ పట్ల మక్కువ ఉంటే తప్ప కెరీర్‌లో ముందుకు వెళ్లలేరు. ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా ఎదగడం అంత సులువు కాదు. అసాధ్యం కూడా కాదు. అభిరుచి ఉండి, క్రీడపై నిజంగా ఇష్టం ఉంటే కెరీర్‌లో ఎంత దూరమైనా ప్రయాణించొచ్చు.

ఇన్నేళ్లవుతున్నా భారత టెన్నిస్‌లో మరో సానియా రాకపోడానికి కారణాలేంటి? సానియా స్థాయి క్రీడాకారిణి ఇంకొకరు వచ్చే అవకాశం ఉందా?

ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఒక్క మాటలో సమాధానం చెప్పలేం. ఆటలో సరైన వ్యవస్థ, నిర్మాణం ఉండాలి. ప్రతిభావంతుల్ని గుర్తించే వేదికలు కావాలి. వారిని ప్రోత్సహించే సంస్థలు ఉండాలి. టెన్నిస్‌ ఖరీదైన క్రీడ. ఒకదశకు చేరుకున్న తర్వాత ప్రతిభకు స్పాన్సర్లు తోడవ్వాలి. అప్పుడే అడుగు ముందుకు పడుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. ప్రతి క్రీడాకారిణి సానుకూల దృక్పథంతో ప్రయత్నిస్తూనే ఉంటే ఒక్కరు కాదు ఎంతోమంది సానియాలు వస్తారు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

సానియా మీర్జా సంచలన నిర్ణయం.. ఆటకు వీడ్కోలు

రిటైర్మెంట్​ విషయంలో తొందరపడ్డానేమో!: సానియా మీర్జా

Last Updated : Feb 2, 2022, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details