తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నన్ను ఒంటరి చేసి హింసించారు'.. మాజీ కోచ్‌పై మరో సైక్లిస్ట్​ ఆరోపణలు

జాతీయ సైక్లింగ్‌ మాజీ కోచ్‌ ఆర్కే శర్మ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ భారత టాప్‌ మహిళా సైక్లిస్ట్‌.. ఇటీవలే సాయ్‌కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తాజాగా మరో సైక్లిస్ట్​ దెబోరా హెరాల్డ్​.. ఆర్కేశర్మ తనపై చేయిచేసుకున్నారని, ఒంటరి చేసి హింసించారని ఆరోపించింది. జాతీయ జట్టులో చోటు కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.

By

Published : Jun 17, 2022, 8:16 AM IST

cyclist deborah herold
cyclist deborah herold

ఓ ప్రముఖ మహిళా సైక్లిస్ట్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఉద్యోగం పోగొట్టుకున్న కోచ్‌ ఆర్కే శర్మ చుట్టు మరింత ఉచ్చు బిగుసుకుంటోంది. ఒకప్పటి అగ్రశ్రేణి సైక్లిస్ట్‌ దెబోరా హెరాల్డ్‌ తాజాగా ఆ కోచ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. సహాయక కోచ్‌ దేవి తన పట్ల అన్యాయంగా వ్యవహరించడం వల్ల జాతీయ జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.

"అండమాన్‌కే చెందిన ఓ మహిళా సైక్లిస్ట్‌తో నేను సంబంధం పెట్టుకున్నానని దేవి అనుకుంది. దీంతో చాలా హింసించింది. మిగతా సైక్లిస్టుల నుంచి నన్ను దూరం పెట్టింది. చివరకు జాతీయ శిబిరం నుంచి కూడా తొలగించారు. ఆర్కే శర్మ, దేవి మమ్మల్ని మానసికంగా వేధించారు. ఇతర మహిళా లేదా పురుష సైక్లిస్ట్‌తో మాట్లాడితే తప్పుగా చూసేవాళ్లు. చివరకు నేను ఒంటరిగా హాస్టల్‌ గదిలో భోజనం చేయాల్సి వచ్చింది. చేయని నా తప్పుకు ఎంతో చిత్రవధ అనుభవించా. ఓ సారి నా గదిలో ఏసీ పనిచేయకపోవడంతో అండమాన్‌కే చెందిన పురుష సైక్లిస్ట్‌ గదికి వెళ్లా. అది చూసి శర్మ నాపై చేయి చేసుకున్నాడు. వీళ్ల సారథ్యంలోని శిక్షణ శిబిరంలో భయంకరమైన వాతావరణం ఉండడంతో సాధనపై దృష్టి పెట్టలేకపోయాం. చివరగా జట్టు నుంచి తొలగించారు" అని అండమాన్‌ సైక్లిస్ట్‌ హెరాల్డ్‌ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దేవి.. సైక్లింగ్‌ సమాఖ్య సూచనల మేరకే నడుచుకున్నానని పేర్కొంది.

ఇక దెబోరా హెరాల్డ్ 2012 నుంచి భారత్‌ తరపున సైక్లింగ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. ఆర్కే శర్మ నేతృత్వంలో మరింత రాటుదేలి 2014లో జరిగిన ఆసియా కప్‌ ట్రాక్‌లో 500 మీటర్ల టైమ్‌ ట్రయల్‌లో విజేతగా నిలిచింది. 2015 అక్టోబర్‌లో జరిగిన తైవాన్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ క్లాసిక్‌లో ఐదు మెడల్స్‌ సాధించిన హెరాల్డ్‌.. ఆ తర్వాత ట్రాక్‌ ఇండియా కప్‌లో మూడు మెడల్స్‌ సొంతం చేసుకుంది. ఇక యూసీఐ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం సంపాదించిన హెరాల్డ్‌.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా సైక్లిస్ట్‌గా చరిత్ర సృష్టించింది.

ఇవీ చదవండి:నిలవాలంటే గెలవాల్సిందే... టీమ్‌ ఇండియాకు 'సఫారీ' పరీక్ష

వికెట్లు, క్యాచ్​లు, బ్యాటింగ్​ ఏదీ లేదు.. అయినా 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్'​!

ABOUT THE AUTHOR

...view details