ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు భారత మహిళల 4x100మీ. రిలే జట్టు అర్హత సాధిస్తుందని ఆ బృందంలో ఒకరైన స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే నెలలో పొలెండ్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ రిలేలో రాణించి టోక్యో బెర్త్ సాధిస్తామని చెప్పింది. వచ్చే నెల 1న ఆరంభమయ్యే ఆ పోటీల్లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. భారత మహిళల 4x100మీ. రిలే జట్టులో హిమతో పాటు ద్యుతిచంద్, అర్చన, ధనలక్ష్మీ, హిమశ్రీ, ధనేశ్వరి ఉన్నారు.
"ద్యుతి కూడా జట్టులో ఉంది. ప్రపంచ రిలే ఛాంపియన్షిప్ లో మెరుగైన ప్రదర్శనతో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తామనే నమ్మకంతో ఉన్నా. మేం అది సాధించాలి. నేను మంచి లయతో ఉన్నా. మిగతా అథ్లెట్లు కూడా మంచిగా సన్నద్ధమవుతున్నారు. ఫెడరేషన్ కప్‌లో వ్యక్తిగతంగా మేం రాణించాం" అని ఆమె చెప్పింది. శిక్షణ కోసం టర్కీ వెళ్లనున్న తను.. అక్కడ 100మీ, 200మీ. పరుగుపైనే పూర్తి దృష్టి పెడతానని చెప్పింది.