మన దేశీయ క్రీడలకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్'లో కలరియపట్టు సహా నాలుగు దేశీయ క్రీడలకు చోటు దొరికింది. హరియాణాలో జరగనున్న ఈ పోటీల్లో కలరియపట్టు, గట్కా, తంగ్-టా, మల్లకంబూలకు స్థానం కల్పిస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా దేశీయ క్రీడలు భారత చారిత్రక సంపద అని పేర్కొన్నారు క్రీడా మంత్రి కిరణ్ రిజిజు. వాటిని సంరక్షించడం, ప్రచారం చేయడం, ప్రజాదరణ కల్పించడం తమ శాఖ ప్రాధాన్యాంశమని చెప్పారు.
"దేశీయ క్రీడల అథ్లెట్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి 'ఖేలో ఇండియా' కంటే ఉత్తమ వేదిక మరొకటి లేదు. యోగాసనాలతో పాటు ఖేలో ఇండియా-2021లో ఈ నాలుగు క్రీడలకు విశేషాదరణ దక్కుతుందని నేను నమ్ముతున్నాను. రానున్న సంవత్సరాల్లో మరిన్ని దేశీయ క్రీడలకు ఈ పోటీల్లో స్థానం కల్పిస్తాం"
-- కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి