టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) పాల్గొననున్న భారత అథ్లెట్లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. 'చీర్ ఫర్ ఇండియా' పేరుతో ఈ గీతాన్ని.. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం(జులై 14) విడుదల చేశారు. క్రీడాకారులకు మద్దతుగా నిలవాలని దేశ ప్రజలకు కోరారు. ప్రతిఒక్కరూ ఈ పాట వినాలని అన్నారు. యువ గాయని అనన్యా బిర్లా ఈ గీతాన్ని ఆలపించగా గ్రామీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చారు.
పతకాల ప్రదానోత్సవంలో మార్పులు
ఒలింపిక్స్(Tokyo Olympics) విజేతలకు అందించే పతకాల ప్రదానోత్సవంలో మార్పులు చేశారు నిర్వాహకులు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ వేడుకను నిర్వహించనున్నారు. సాధారణంగా గెలుపొందిన అథ్లెట్లకు మెడల్స్‌ను వారి మెడలో వేసి సత్కరిస్తారు. అయితే ఈ సారి కరోనా కారణంగా పతకాలను ఓ ట్రేలో తీసుకురాగా, క్రీడాకారులు స్వయంగా తమ పతకాలను మెడలో వేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు. కరచాలనం, ఆలింగనం వంటివి కూడా ఉండవని స్పష్టం చేశారు.