‘అదృష్టం కోసం ఎదురు చూడటం కంటే... మన కోసం అవకాశాల్ని సృష్టించుకోగలిగితేనే గుర్తింపు’ అని నమ్ముతా. అడవిలో పుట్టి పెరిగిన నాకు కష్టం అంటే ఏంటో తెలుసు. ఆకలి బాధలు ఎలా ఉంటాయో చూశా. అలాంటి నేను అడవి దాటి, విమానం ఎక్కి... విదేశీ గడ్డపై కాలుమోపడం... మన దేశం తరఫున ఆడటం... ఇదంతా ఇప్పటికీ కలగానే అనిపిస్తోంది.'
-కుంజా రజిత
నలభై ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని ఛత్తీస్‌గఢ్ నుంచి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని ఆదివాసీ గ్రామానికి వచ్చింది మా కుటుంబం. చుట్టూ అడవి, అక్కడక్కడా విసిరేసినట్లు ఉండే ఇళ్లు. చిమ్మచీకట్లో మిణుకుమిణుకుమంటూ వెలిగే సౌరదీపాలు.. బాహ్యప్రపంచంతో కలవాలంటే కనీసం ఆరు కిలోమీటర్లు నడిస్తేనే కానీ చేరుకోలేం. అలాంటి చోటే నా(KUNJA RAJITHA) బాల్యం గడిచింది. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ భద్రమ్మ, ముగ్గురన్నయ్యలు, నేను... కట్టెలు కొట్టి, కూలికి వెళ్లి సంపాదిస్తేనే ఇల్లు గడిచేది. మా తలరాతలు మారాలంటే చదువుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఆదివాసీ గొత్తికోయ తెగలకు ఇక్కడ ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో కుల ధ్రువీకరణ రాలేదు. అది లేకపోతే ఉచిత విద్యావకాశాలు, ప్రభుత్వ రాయితీలు.. ఏవీ వర్తించవు. నా తపన చూసిన అన్నయ్య జోగయ్య నన్ను ఎలాగైనా బడిలో చేర్చాలనుకున్నాడు.
చింతూరు మండలంలోని కాటుకపట్టి మిషనరీ పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పిస్తారని తనకు తెలిసిన వారెవరో చెప్పారు. అక్కడ చేరా. అడవిలో ఆడుతూ, పాడుతూ తిరిగిన నాకు తోటి విద్యార్థులతో కలిసి ఆటలాడటం భలే ఇష్టంగా ఉండేది. అక్కడ పరుగులో నా వేగాన్ని టీచర్లు గమనించారు. ప్రత్యేకంగా ప్రోత్సహించారు. క్రమంగా మండల, జిల్లా పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టా. కాకినాడలో జోనల్ క్రీడలకు ఎంపిక కావడం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మరింత సాధన చేస్తే... మరిన్ని విజయాలు సాధించగలనని నమ్మారు అక్కడి పాస్టర్లు. మరిన్ని మెలకువలు నేర్చుకునేందుకు నెల్లూరులోని సుబ్బారెడ్డి పాఠశాలో చేర్చారు. అక్కడ శిక్షణ తీసుకుంటూనే ఎనిమిది, తొమ్మిది తరగతులు పూర్తి చేశా. ఆపై మంగళగిరిలో జేకే జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూనే నెల్లూరులో అథ్లెటిక్ కోచ్‌లు వంశీ, కిరణ్, కృష్ణమోహన్‌ల దగ్గర శిక్షణ తీసుకున్నా. అదే సమయంలో గుంటూరులో జమైకా కోచ్ మైక్ రసెల్ దగ్గర సాధన చేశా. ఓ పక్క చదువూ, సాధన చేస్తూనే పోటీల్లో పాల్గొనేదాన్ని. అక్కడ నా ఆటలోని బలాలు, బలహీనతలు తెలుసుకుంటూ మెరుగుపరుచుకునేదాన్ని.
పుల్లెల గోపీచంద్ సాయంతో..
నా ఆట అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే ఉన్నత శిక్షణ అవసరం అని భావించారు అంతా. అప్పుడే ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగుబండి రమేష్ గురించి తెలిసింది. ఆయన్ని సంప్రదిస్తే శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. నా పరిస్థితి చూసి... పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలోని మైత్రీ ఫౌండేషన్‌కి చెప్పడంతో వారు ఫిజియోథెరపీ, అవసరమైన దుస్తులు, బూట్లు వంటివన్నీ అందిస్తున్నారు. మెరుగైన ఆటకు శారీరక దారుఢ్యమూ ఎంతో అవసరం. ముఖ్యంగా ఖరీదైన ప్రొటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. నా ఆటతీరు, కుటుంబ పరిస్థితి గమనించిన లెక్కల మాస్టారు నాగేంద్ర నెలకు పదివేల రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు.
గతేడాదిగా జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ఒక రజత పతకం, రెండు కాంస్య పతకాలు అందుకున్నా. తాజాగా కెన్యాలో జరుగుతోన్న అండర్-20 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రిలే పరుగు పందెం పోటీల్లో దేశం తరఫున ఐదుగురు పాల్గొంటుంటే...అందులో తెలుగమ్మాయిని నేనొక్క దాన్నే. పరుగుల రాణి పీటీ ఉష నాకు ఆదర్శం. దేశం గర్వించే విజయాలను సాధించాలన్నది నా లక్ష్యం. అప్పుడు అందరి దృష్టీ మా ఊరి మీద, మా ఆదివాసీల మీద పడుతుంది. అప్పుడైనా మావీ, మా తోటి వారివీ జీవితాలు మారతాయన్నది ఆశ. అందుకోసమే ఈ కష్టమంతా.