తెలంగాణ

telangana

ETV Bharat / sports

పట్టుబట్టి.. నాన్న కల నెరవేర్చిన అన్షు - జగదీశ్‌ షెరోన్‌

సరిగ్గా 30 ఏళ్ల క్రితం సంగతి.. 76 కేజీల విభాగంలో ధర్మవీర్‌ మలిక్‌ జాతీయ రెజ్లింగ్‌ ఛాంపియన్‌.. దేశవ్యాప్తంగా టోర్నీల్లో సత్తా చాటాడతను.. కానీ ప్రపంచ స్థాయిలో ఒక్క పతకం కూడా అతని ఖాతాలో లేదు. జూనియర్‌ అంతర్జాతీయ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగినా పతకం ఆశ తీరలేదు. 1995లో ప్రపంచ క్యాడెట్‌ టోర్నీలో ఆడాడు అక్కడా రిక్త హస్తమే! కానీ, ఇన్నాళ్లకు ధర్మవీర్‌ కల నెరవేరింది. ఒక అంతర్జాతీయ పతకం వాళ్ల ఇంటికి వచ్చింది! కానీ సాధించింది అతను కాదు అతని తనయ! ఇలా నాన్న కలను నిజం చేసిన ఆ కూతురే అన్షు.

special story about haryana wrestler anshu who achieves his father dream
పట్టుబట్టి.. నాన్న కల తీర్చి! పతకం నెగ్గిన అమ్మాయి

By

Published : Dec 19, 2020, 7:08 AM IST

ఒక్క అంతర్జాతీయ పతకం లేకుండానే‌ గాయంతో మధ్యలోనే కెరీర్‌ ముగించాడు ఒకప్పటి జాతీయ రెజ్లింగ్​ ఛాంపియన్​ ధర్మవీర్​ మలిక్​. మూడు దశాబ్దాలు గడిచాయ్‌! ఇప్పుడాయన కల నెరవేరింది. అంతర్జాతీయ పతకం అతని ఇంటికి చేరింది. అది సాధించింది ఆయన కుమార్తె అన్షు. బెల్‌గ్రేడ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ రెజ్లింగ్‌లో 57 కేజీల విభాగంలో రజతం గెలిచి సత్తా చాటిందీ హరియాణా అమ్మాయి. టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సంపాదించడమే లక్ష్యంగా సాగుతోందీ టీనేజర్‌.

అలా కుస్తీపై ఇష్టం..

నిజానికి అన్షు రెజ్లర్‌ అవుతుందని తన కల తీరుస్తుందని ఆమె తండ్రి ఊహించనేలేదు. ఎందుకంటే తనయుడు శుభమ్‌ మలిక్‌ రెజ్లింగ్‌లో ఎదగాలని అనుకున్నాడు. అందుకే శుభమ్‌ పాఠశాల నుంచే కుస్తీ ఎంచుకోగా.. అన్షు చదువు మీదే దృష్టి పెట్టింది. చదువులో ఆమె టాపర్‌ కూడా. కానీ అప్పుడప్పుడు అన్నతో పాటు అన్షు రెజ్లింగ్‌ శిక్షణ కేంద్రానికి వెళ్లేది. అలా వెళ్లడంతో కుస్తీపై ఆమెకు ఇష్టం కలిగింది. తన గ్రామం నిధానిలో ఉన్న సీబీఎస్‌ఎం స్పోర్ట్స్‌ స్కూల్‌లో కోచ్‌ జగదీశ్‌ షెరోన్‌ శిక్షణలో ఆమె ఈ ఆటలో రాటుదేలింది.

కొద్ది కాలంలోనే.. సత్తా చాటిన అన్షు

కొద్ది కాలంలోనే ఆమె సత్తా చాటడం మొదలుపెట్టింది. మొదట జాతీయ టోర్నీల్లో మెరిసిన ఆమె.. 2016లో తైవాన్‌లో జరిగిన ఆసియా జూనియర్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం సొంతం చేసుకుంది. అదే ఏడాది ప్రపంచ క్యాడెట్‌ టోర్నీలో కాంస్యం నెగ్గిన అన్షు.. ఆ తర్వాత సంవత్సరం ఏథెన్స్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్‌ టోర్నీలో పసిడి పతకం కైవసం చేసుకుంది. ఆమె రెజ్లింగ్‌లో రాణిస్తుండడం వల్ల ఆమె తండ్రి ధర్మవీర్‌.. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. అన్షుకు అండగా ఉండేందుకు సోనెపట్‌కు వచ్చేశాడు.

గాలివాటం కాదని నిరూపించింది..

అన్షు ప్రతిభ కేవలం జూనియర్‌ కేటగిరితోనే ఆగలేదు. సీనియర్‌ విభాగంలోనూ ఆమె సత్తాచాటుతోంది. గతేడాది 57 కేజీల విభాగంలో జాతీయ సీనియర్‌ టైటిల్‌ గెలిచిన అన్షు.. ఇటలీలో జరిగిన ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్‌ లిండా మోరిస్‌ (కెనడా), రెండుసార్లు ఐరోపా ఛాంపియన్‌ గ్రేస్‌ బాలెన్‌ (నార్వే)కు షాకిచ్చి తన విజయాలు గాలివాటం కాదని నిరూపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజేత పూజ దండను కూడా రెండుసార్లు ఓడించిన అన్షులో టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సంపాదించే సత్తా ఉందని కోచ్‌లు అంటున్నారు.

'ఆరంభంలో అన్షు ఎదురుదాడిపైనే దృష్టిపెట్టేది.ఇప్పుడు డిఫెన్స్‌లోనూ మెరుగైంది. భయం లేకుండా ఆడడమే ఆమె ప్రత్యేకత. ఒలింపిక్స్‌ కోటా సాధించడమే కాదు.. పతకాన్ని గెలుచుకునే సత్తా ఆమెకుంద'ని జాతీయ కోచ్‌ కుల్‌దీప్‌ చెప్పాడు. 'ప్రపంచ స్థాయిలో పతకం గెలిచి అన్షు నా కలను నిజం చేసింది. మోకాలి గాయంతో రెజ్లింగ్‌ వదిలేశాను. ఇన్నాళ్లకు ప్రపంచకప్‌ రెజ్లింగ్‌లో మా అమ్మాయి రజతం గెలవడం ఉద్వేగంగా ఉంది' అని అన్షు తండ్రి ధర్మవీర్‌ చెప్పాడు.

ఇదీ చూడండి:స్టార్ షట్లర్ సింధుతో పాటు కోచ్, ఫిజియో​

ABOUT THE AUTHOR

...view details