దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ కొట్టేసింది. గురువారం ఏకంగా 50 మెడల్స్ సొంతమయ్యాయి. స్విమ్మింగ్, ఉషు, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో, అథ్లెటిక్స్‌లో పతకాల పంట పండింది. నాలుగోరోజు 30 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్య పతకాలు ఖాతాలో చేరాయి. ఫలితంగా మొత్తం 62 స్వర్ణ, 41 రజత, 21 కాంస్య పతకాలతో సహా 124 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది భారత్.
నేపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో... స్విమ్మింగ్, ఉషు, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో, అథ్లెటిక్స్‌లో భారత్ క్రీడాకారుల హవా కొనసాగింది.వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుంది. మహిళల 45 కేజీల విభాగంలో జిల్లీ పసిడి గెలవగా, స్నేహ సోరెన్ (49 కేజీలు), బింద్యారాణి (55 కేజీలు) స్వర్ణాలు సాధించారు. పురుషుల 61 కేజీల విభాగంలో సిద్ధాంత్ గొగోయ్ పసిడి గెలిచాడు. స్విమ్మింగ్‌లో 4 స్వర్ణ, 6 రజత, 1 కాంస్యం దక్కగా.. తైక్వాండోలో 3 పసిడి పతకాలతో పాటు రజత, కాంస్య పతకాలు ఖాతాలో చేరాయి.