కాఠ్మాండు వేదికగా జరుగుతున్న దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. పోటీల ఎనిమిదో రోజూ మన అథ్లెట్లు పతకాల పంట పండించారు. ఆదివారం ఒక్కరోజే ఖాతాలో 38 పతకాలు (22 స్వర్ణ, 10 రజత, 6 కాంస్యాలు) చేరాయి. ఫలితంగా మొత్తం 252 పతకాలతో (132 స్వర్ణ, 79 రజత, 41 కాంస్యాలు) భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
సాక్షి ఖాతాలో స్వర్ణం...
రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు దక్కాయి. ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) పసిడి పతకం నెగ్గగా, పురుషుల 61 కేజీల విభాగంలో రవీందర్ స్వర్ణం సాధించాడు. పవన్ కుమార్ (86 కేజీలు), అన్షు (59 కేజీలు) కూడా పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
బాక్సింగ్‌లో మరో ఆరుగురు తుది సమరంలో అడుగుపెట్టారు. స్పర్శ్ (52 కేజీలు), వరీందర్ (60 కేజీలు), నరేందర్ (91 కేజీల పైన), పింకీ (51 కేజీలు), సోనియా లాథర్ (57 కేజీలు), మంజు (64 కేజీలు) ఫైనల్ చేరారు. స్విమ్మింగ్‌లో మన బృందం.. 7 స్వర్ణ, 2 రజత, 2 కాంస్యాలు సాధించింది.
టెన్నిస్‌లోనూ దూకుడు..
టెన్నిస్ డబుల్స్ విభాగాల్లోనూ భారత క్రీడాకారులు రాణించారు. డబుల్స్ విభాగంలో సౌజన్య, సాకేత్, విష్ణువర్ధన్‌లు స్వర్ణాలు సాధించారు. నేడు జరగనున్న మహిళల సింగిల్స్‌లో పసిడి కోసం తెలంగాణకు చెందిన సాత్వికతో ఫైనల్లో తలపడనుంది సౌజన్య. పురుషుల సింగిల్స్ విభాగంలో పసిడి కోసం భారత ఆటగాళ్లు సాకేత్ మైనేని, మనీశ్ పోటీపడనున్నారు.
షూటింగ్‌లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో శ్రవణ్ కుమార్, రవీందర్ సింగ్, సుమీత్‌లతో కూడిన భారత బృందం స్వర్ణం నెగ్గింది. వ్యక్తిగత విభాగంలో శ్రవణ్ బంగారు పతకం సొంతం చేసుకోగా... రవీందర్‌సింగ్ కాంస్యం గెలిచాడు.