చెస్ ఒలింపియాడ్ మాకు ఒలింపిక్స్‌తో సమానం. నేను నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నా. చెస్ ఒలింపియాడ్‌కు తొలిసారిగా భారత్ ఆతిథ్యమిస్తోంది. ప్రతిసారి జట్టుకు ఆడా. సొంతగడ్డపై ఆడకుంటే ఎలా అని అనిపించింది. పైగా టాప్ సీడ్‌గా ఉన్నాం. చెన్నైకి విమానంలో గంట ప్రయాణమే కాబట్టి ఇబ్బంది లేదు. రష్యాలో టోర్నీ జరుగుతుంటే వెళ్లడానికి అవకాశం ఉండేది కాదు. విమానంలో అనుమతి లభించకపోతే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకున్నా. చాలా రోజులుగా ఇంట్లోనే ఉంటూ సాధన చేస్తున్నా. అన్ని గేమ్‌లూ కాకపోయినా వివిధ దశల్లో కొన్నైనా ఆడగలిగితే బాగుంటుందని అనుకుంటున్నా. ఒత్తిడి సంగతి ఇప్పుడే చెప్పలేను. చాలా నెలలుగా ఇంట్లోనే ఉంటున్నా. చెస్ సాధన చేయడమే తప్ప మరో పనైతే లేదు. మానసికంగా ఆటకు సిద్ధంగా ఉన్నా. చెస్ శారీరక క్రీడ కాదు. డాక్టర్ కూడా ఆడొచ్చని సలహా ఇచ్చారు. గతంలో 3, 4 నెలల గర్భిణులు కొందరు ఆడుండొచ్చు. ఎక్కువ నెలలతో ఆడుతున్న క్రీడాకారిణిని నేనే అనుకుంటా.
పతకావకాశాలు పుష్కలం:కాగితం మీద చూస్తే భారత్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. టాప్ సీడ్ కూడా. కానీ ఇది స్విస్ ఫార్మాట్. 11 రౌండ్ల టోర్నీ. ఒక్క రౌండ్ తేడా వచ్చినా ఓవరాల్ ఫలితంపై ప్రభావం ఉంటుంది. 2020, 2021లలో ఆన్‌లైన్‌లో ఒలింపియాడ్ జరిగింది. 2018లో చివరి సారిగా ప్రత్యక్షంగా ఆడాం. ఇప్పుడు మళ్లీ ఆడబోతున్నాం. ఎవరు ఎలాంటి ఫామ్‌లో ఉన్నారో తెలియదు. టోర్నీ ప్రారంభమయ్యే దాకా ఆ విషయం తెలియదు కూడా. కరోనా కాలంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే టోర్నీలు జరిగాయి. ఫార్మాట్ కూడా భిన్నం. ఆన్‌లైన్‌లో జూనియర్ (బాలురు, బాలికలు), పురుషులు, మహిళలు కలిపి ఒకే జట్టుగా ఆడాం. 2020లో స్వర్ణం (రష్యాతో కలిసి), 2021 కాంస్య పతకాలు వచ్చాయి.