గాయంతో అయిదు నెలలు ఆటకు దూరంగా ఉన్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మళ్లీ రాకెట్ పట్టనుంది. మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీతో సింధు పునరాగమనం చేయనుంది. మంగళవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ఆమెకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఒలింపిక్ మాజీ ఛాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను ఢీకొననుంది. సింధుపై 9-5తో మెరుగైన గెలుపొటముల రికార్డున్న మారిన్.. భారత క్రీడాకారిణితో తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ పైచేయి సాధించింది.
5 నెలల తర్వాత బరిలోకి సింధు.. తొలి రౌండ్లోనే ప్రపంచ ఛాంపియన్‌తో పోరు - Malaysia Open 2023
ఐదు నెలల సుదీర్ఘ విరామం అనంతరం పీవీ సింధు.. మలేసియా ఓపెన్‌లో ఆడేందుకు సిద్ధమైంది. సింధుతో పాటు మరికొంత మంది భారత షట్లర్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
నిరుడు ఆగస్టులో కామన్వెల్త్ క్రీడల్లో చివరి సారిగా బరిలో దిగిన సింధు.. కొత్త ఏడాదిని ఎలా ప్రారంభిస్తుందో చూడాలి. మిగతా మ్యాచ్‌ల్లో హాన్ యూ (చైనా)తో సైనా నెహ్వాల్, వెన్ షి (చైనీస్ తైపీ)తో ఆకర్షి కశ్యప్, ఆన్ సి యంగ్ (కొరియా)తో మాళవిక బాన్సోద్ పోటీపడతారు. 2022ను చిరస్మరణీయం చేసుకున్న హెచ్.ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ కొత్త ఏడాదిని గొప్పగా ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
అయితే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ లక్ష్యసేన్‌తో ప్రణయ్ తలపడనున్నాడు. కెంటా నిషిమొటొ (జపాన్)తో కిదాంబి శ్రీకాంత్ తన పోరాటాన్ని ప్రారంభిస్తాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో చోయ్ గ్యు- కిమ్ వాన్ హో (కొరియా)తో సాత్విక్ సాయిరాజు- చిరాగ్‌శెట్టి, మిన్ హ్యుక్- సూంగ్ జే (కొరియా)తో కృష్ణ ప్రసాద్- విష్ణువర్ధన్ గౌడ్ తలపడతారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో యూంగ్ టింగ్- యూంగ్ లామ్ (హాంకాంగ్)తో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ, సుపిసర- సుపజిరకుల్ (థాయ్‌లాండ్)తో అశ్విని భట్- శిఖ గౌతమ్ పోటీపడతారు.