కరోనా ధాటికి మరో మాజీ క్రీడాకారిణి తుదిశ్వాస విడిచింది. జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టి.. "షూటర్ దాది"గా పేరు తెచ్చుకున్న వెటరన్ షూటర్ చంద్రో తోమర్ ఇక లేదు. 15 ఏళ్లకే పెళ్లి చేసుకుని.. జీవితంలో ఎన్నో సమస్యలను దాటి.. వయసు మీద పడ్డాక షూటర్‌గా కొత్త ప్రస్థానాన్ని మొదలెట్టిన ఆమె స్ఫూర్తి ప్రయాణానికి కరోనా మహమ్మారి ముగింపు పలికింది. ప్రాణాంతక వైరస్‌తో పోరాడిన 89 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్ షూటర్ బామ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచింది.
"ఆమె నన్ను విడిచి వెళ్లిపోయింది. చంద్రో ఎక్కడికి వెళ్లావు?" అని చంద్రో మరదలు ప్రకాశి తోమర్ ట్విట్టర్లో పోస్టు చేసింది. చంద్రో స్ఫూర్తితో తుపాకీ పట్టిన 84 ఏళ్ల ప్రకాశి కూడా వెటరన్ షూటర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ వయస్సు కలిగిన మహిళా షార్ప్ షూటర్ గా నిలిచిన చంద్రో జీవిత కథ ఆధారంగా "సాండ్ కి ఆంఖ్" పేరుతో బాలీవుడ్లో సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాలో ప్రకాశి ప్రస్థానమూ ఉంది.
ఇదీ చదవండి:సీఎస్కే జోరుకు ముంబయి బ్రేకులు వేసేనా?
అలా.. మొదలై:
వయసు మీద పడుతోన్న దశలో.. సాధారణంగా చూపు మందగించే వయ సులో.. 65 ఏళ్లు నిండాక చంద్రో తొలిసారి తుపాకీ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ సారి షూటింగ్లో శిక్షణ పొందాలనుకున్న తన మనవరాలితో తోడుగా వెళ్లిన చంద్రో అక్కడ తుపాకీ తీసుకుని మొదటిసారే లక్ష్యాన్ని గురి పెట్టి కాల్చింది. దీంతో అక్కడున్న కోచ్ దృష్టి ఆమె మీద పడింది. తనను షూటింగ్ శిక్షణ తీసుకోమని కోరాడు. అయితే కుటుంబంలోని పెద్దవాళ్లైన మగవాళ్లు అందుకు నిరాకరించినా.. తన కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్ల మద్దతుతో ఆమె శిక్షణ తీసుకుంది.
ఆ తర్వాత 30కి పైగా వెటరన్ షూటింగ్ జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచింది. చివరగా 2016లో పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో యువ షూటర్లకు క్రీడలో సూచనలు అందిస్తూ ఉండేది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఆ కుటుంబం నుంచి సీమా తోమర్ లాంటి షూటర్లు వెలుగులోకి వచ్చారు. చంద్రో మరణం పట్ల కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజు, ఒలింపిక్స్ బాక్సర్ అఖిల్ కుమార్, మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:క్రికెటర్ అశ్విన్ ఇంట్లో 10 మందికి కరోనా