Sheetal Devi Archery : విల్లు ఎక్కు పెట్టి లక్ష్యాన్ని ఛేదించాలంటే దానికి ఎంతో కృష్టి ఉండాలి. చక్కని దృష్టితో పాటు ఏకాగ్రత.. తీక్షణత ఉండాలి. రెండు చేతులు సరిగా ఉన్నవాళ్లే కొన్ని సార్లు ఈ పనిని చేయలేక విఫలవుతుంటారు. కానీ చేతులు లేకుండా బాణాలను సంధింస్తూ చరిత్ర సృష్టిస్తోంది జమ్ముకు చెందిన ఆర్చర్ శీతల్ దేవి. చైనా హంగ్జౌ వేదికగా జరిగిన పారా ఆసియా క్రీడల్లో ఈ 16 ఏళ్ల ఆర్చర్ కాళ్లతోనే లక్ష్యాన్ని ఛేదించి పసిడిని ముద్దాడింది. అయితే ఈ విజయ పథంలో నడిచేందుకు ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని లోయి ధార్ అనే మారుమూల గ్రామానికి చెందిన శీతల్ దేవి.. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి పొలం పనులు చేస్తే.. తల్లి మేకలు కాసేది. ఈ ఇద్దరూ పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి వారిది. పుట్టినప్పటి నుంచి ఫోకోమెలియా అనే వ్యాధితో బాధపడుతున్న శీతల్.. దాని కారణంగా తన రెండు చేతులూ పోగొట్టుకుంది. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. ఎలాగైన ఆ ఇంటికి ఆసరాగా నిలవాలనుకుంది. పెద్దయ్యాక టీచర్ అవ్వాలని కలలు కనింది. కానీ భారత సైన్యం నిర్వహించిన ఓ స్పోర్ట్స్ ఈవెంట్ ఆమె లక్ష్యాన్నే మార్చేసింది.
ఆ పోటీలు.. తన జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్..
Sheetal Devi Biography : 2021లో కిష్త్వార్‌లో భారత సైన్యం ఓ క్రీడా పోటీలను నిర్వహించింది. అందులో ఆమె చురుకుదనాన్ని చూసిన ఇండియన్ ఆర్మీ ఆమెను క్రీడల వైపు ప్రోత్సహించింది. అంతే కాకుండా ఆమెకు కృత్రిమ చేతులను అమర్చేందుకు ప్రయత్నించింది. దానీ కోసం బెంగళూరులోని మేజర్ అక్షయ్ గిరీశ్ మెమోరియల్ ట్రస్ట్‌ను సంప్రదించింది. అయితే కృత్రిమ చేతులు ఆమెకు సరిపోలేదు. అయనప్పటికీ తన లక్ష్యాన్ని ఎలగైనా సాధించాలని పట్టుదలతో ట్రైనింగ్‌కు హాజరైంది. అలా కత్రాలోని శ్రీ మాతా వైష్ణో దేవి ష్రైన్ బోర్డ్ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు వెళ్లింది.
అక్కడున్న ఇతర పారా ఆర్చర్లు ఎలా ఆర్చరీ చేస్తున్నారో గమనించింది. వారిని చూసి ప్రేరణ చెందిన శీతల్..తనకంటూ ఓ ప్రత్యేక శైలిని రూపొందించుకుంది. ఒక కుర్చీలో కూర్చొని కుడి కాలితో బాణాన్ని పట్టుకుని ఆ తర్వాత కుడి భుజం ఆధారంగా చేసుకుని నోటితో విల్లు నారిని లాగి గురి చూసి కొట్టేది. అలా క్రమ క్రమంగా విలువిద్యలో తనను తాను మెరుగుపరుచుకుని దూసుకెళ్లింది. రెండు చేతులు ఉన్న ఆర్చర్లతో పోటీపడి గెలిచేది.