తెలంగాణ

telangana

ETV Bharat / sports

యుఎస్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ ఓటమి.. ఆటకు వీడ్కోలు - సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు

అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ టెన్నిస్​కు వీడ్కోలు పలికింది. తాజాగా జరిగిన యుఎస్‌ ఓపెన్‌లో ఓటమి చెందిన ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది.

Serena williams retirement
యుఎస్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ ఓటమి

By

Published : Sep 3, 2022, 9:38 AM IST

Updated : Sep 3, 2022, 10:32 AM IST

Serena williams retirement యుఎస్‌ ఓపెన్‌లో ఓటమితో అమెరికా దిగ్గజం, టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ పోరాటం ముగిసింది. ఆమె ఆటకు వీడ్కోలు పలికింది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన సెరెనా అమెరికా ఓపెన్‌ మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అజ్లా టోమ్లానోవిక్ చేతిలో పరాజయం పాలైంది. సెరెనాపై అజ్లా 7-5, 7-5, 6-7, 6-1 తేడాతో విజయం సాధించింది. ఓటమి అనంతరం కన్నీరు పెట్టుకున్న సెరెనా ఇది తన జీవితంలో అపురూపమైన ప్రయాణమని తెలిపింది.

తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈనెలలో 41వ పుట్టినరోజు జరుపుకున్న సెరెనా ఆటలకు దూరంగా నూతన జీవితం ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అనే పదాన్ని చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. కాగా, యూఎస్‌ ఓపెన్‌ తర్వాత ఆటకు వీడ్కోలు చెబుతానని ఇదివరకే సెరెనా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రిటైర్‌మెంట్‌ నిర్ణయంపై పునరాలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా..? అన్న ప్రశ్నకు 'మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు' అని సమాధానం ఇచ్చింది.

టెన్నిస్‌లో ఉన్నత శిఖరాలకు చేరడం వెనుక తన సోదరి వీనస్ విలియమ్స్‌ కీలక పాత్ర పోషించిందని సెరెనా వివరించింది. "వీనస్‌ లేకపోతే ఇక్కడ సెరెనా ఉండేది కాదు. అందుకే వీనస్‌కు ధన్యవాదాలు చెబుతున్నా. టెన్నిస్‌లో ఉన్నత స్థాయికి రావడానికి కారణం వీనస్‌. ఇదంతా నా తల్లిదండ్రుల వల్లే.. ప్రతి దానికి వారే అర్హులు. అందుకోసం కృతజ్ఞతాభావంతో ఉంటా. నా కంట్లో నుంచి వచ్చే నీళ్లు ఆనందభాష్పాలు అనుకుంటున్నా" అని సెరెనా తెలిపింది.

ఇదీ చూడండి: ఆదివారం భారత్, పాక్ మ్యాచ్.. వారంలో రెండోసారి చిరకాల ప్రత్యర్థుల పోరు

Last Updated : Sep 3, 2022, 10:32 AM IST

ABOUT THE AUTHOR

...view details