Satwiksairaj Rankireddy Khel Ratna :భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం సొంతం చేసుకుంది. అయితే ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ పలు ఆసక్తికర విషయాలను పెంచుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో దేశం గర్వించేలా చేస్తామని తెలిపాడు.
దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని సాత్విక్ తెలిపాడు. 2020లో అర్జున అవార్డు లభించిందని, ఖేల్‌రత్న సాధించాలని అప్పుడే అనుకున్నామని చెప్పాడు. మూడేళ్ల వ్యవధిలోనే ఈ పురస్కారం దక్కుతుందని ఊహించలేదని వెల్లడించాడు. ఖేల్‌రత్న అవార్డుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని వివరించాడు.
"మేమెప్పుడూ అవార్డుల కోసం ఆడలేదు. దేశం కోసం ఆడాం. విజయాలు సాధిస్తే ర్యాంకులు, అవార్డులు వస్తాయని తెలుసు. భారత్‌కు మంచి డబుల్స్ జోడీ ఉండాలన్నదే మొదట్నుంచి మా లక్ష్యం. సింగిల్స్‌లో చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. డబుల్స్‌లో అత్యుత్తమ క్రీడాకారుల లోటు ఉండేది. అప్పట్లో టీమ్ ఈవెంట్లో దేశాన్ని గెలిపించే వాళ్లు లేరు. డబుల్స్‌లో ఎప్పుడూ చుక్కెదురయ్యేది. అందుకే పట్టుదలగా డబుల్స్ మొదలుపెట్టాం. అవార్డుల కోసం వెంటపడలేదు. గెలిస్తే అన్నీ వస్తాయని మాత్రం తెలుసు"
-- రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్
తన విజయం వెనుక అసలైన హీరో నాన్నేనని చెప్పాడు సాత్విక్. అర్జున అవార్డు అమ్మానాన్నకు అంకితమిచ్చానని, ఖేల్‌రత్న మాత్రం నాన్నకే అంకితమని తెలిపాడు. "అమలాపురంలో నాన్న ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఇప్పటికీ ఆయన శ్వాస క్రీడలే. కనీసం 20-25 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేశారు. బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్‌కు ఎంతో సేవ చేశారు. అమలాపురంలో సింథటిక్ బ్యాడ్మింటన్ కోర్టుల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు" అని తెలిపాడు.
"ఇప్పటి వరకు మా కెరీర్‌లో 2022 అత్యుత్తమం. నిరుడు థామస్ కప్‌లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా క్రీడల్లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించాం. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాం. 2023 కూడా అద్భుతంగా సాగింది. కాకపోతే ఆర్నెల్లు బాగా ఆడాం. ఆరెల్లు అంచనాలు అందుకోలేదు"
-- రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్
భవిష్యత్తు లక్ష్యం ఇదే!
"ఎన్ని టోర్నీలు గెలిచినా, అవార్డులు సాధించినా అంతిమ లక్ష్యం ఒలింపిక్సే. విశ్వ క్రీడల్లో పతకమే అన్నిటికంటే గొప్ప ప్రదర్శన. 2021 నుంచి మా ఇద్దరి ఆలోచనలు ఒలింపిక్ పతకం చుట్టే సాగుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో గ్రూపు దశలోనే నిష్క్రమించాం. గత కొన్నేళ్ల ప్రదర్శనతో మాపై అంచనాలు పెరిగాయి. ఎవరినీ నిరాశపరచం. ఇంకా బాగా ఆడతాం. 200 శాతం ప్రదర్శన ఇస్తాం. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాం. ఒలింపిక్స్‌లోనూ పోటీ అలాగే ఉంటుంది. తప్పకుండా దేశం గర్వించేలా చేస్తాం" అని సాత్విక్ తెలిపాడు.