Sania Mirza Wimbledon: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశే ఎదురైంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్‌తో కలిసి సెమీఫైనల్లో అడుగుపెట్టిన సానియాకు నీల్(బ్రిటన్), క్రాయెసిక్(అమెరికా) జోడీ చేతిలో ఓటమి ఎదురైంది. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో సానియా జంట 6-4, 5-7, 4-6తో పరాజయం పాలైంది. దాంతో సానియా కెరీర్ వింబుల్డన్ టైటిల్ లేకుండానే ముగియనుంది.
సానియా ఖాతాలో లేని మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ వింబుల్డన్ ఒక్కటే. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన సానియా.. వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు 2011, 2013, 2015లో ఆమె క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 2022 సీజన్ తర్వాత టెన్నిస్ నుంచి తప్పుకుంటానని సానియా ఇది వరకే ప్రకటించింది.
2001లో కెరీర్ ప్రారంభించిన సానియా.. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో 2009 ఆస్ట్రేలియా ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్, 2014 యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకుంది. 2008, 2014, 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు 2016 ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకుంది. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సానియా.. 2015 వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016 ఆస్ట్రేలియా ఓపెన్‌లో డబుల్స్ టైటిళ్లు గెలిచింది.