భారత టెన్నిస్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసింది. రెండు దశబ్దాల పాటు తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ ముగిసింది. ప్రస్తుతం జరుగుతున్న దుబాయ్ డ్యూటీ ఫ్రీ డబ్ల్యూటీఏ 1000 సిరీస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఆమె తన ప్రయాణాన్ని ఓటమితో ముగించింది. ఈ పోరులో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తన అమెరికన్ పార్ట్నర్ క్రీడాకారిణి మెడిసన్ కీస్‌తో బరిలో దిగిన ఆమె.. రష్యన్ జోడీ వెరోనికా సంసోనోవా చేతితో ఓడిపోయింది. 4-6,0-6 తేడాతో పరాజయం చెందింది. ఇక కెరీర్‌లో చివరి టోర్నీ ఆడిన సానియా ఓటమి అనంతరం కన్నీటి పర్యంతరమైంది.
ఇకపోతే ఈ ఏడాది జనవరిలో టెన్నిస్‌కు సానియా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 36ఏళ్ల సానియా.. తన 20 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో 6 డబుల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ముద్దాడింది. 2003లో అంతర్జాతీయ ఆటలోకి అరంగేట్రం చేసిన సానియా మీర్జా 2005లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ఆరంభించింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ సింగిల్స్‌లో రజతం గెలిచింది. సింగిల్స్‌లో గరిష్ఠంగా 27వ ర్యాంకును సాధించిన సానియా.. 2015లో డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును పొందింది.