సెయిలింగ్.. ఇదొక సాహసోపేతమైన క్రీడ. ఇందులో పురుషులే చాలా తక్కువగా ఉంటారు. అలాంటి క్రీడలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అయితే ఈ సాహసోపేత పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది చెన్నై అమ్మాయి నేత్ర కుమనన్. క్లిష్టమైన క్రీడలో విదేశీ ఆటగాళ్లతో పోటీపడి ప్రపంచకప్‌లో భారత్‌కు పతకం అదించింది.
కాంస్యంతో సత్తా..
ఇటీవల అమెరికాలోని మియామిలో జరిగిన ప్రపంచకప్ సెయిలింగ్ పోటీల్లో.. కాంస్యం గెలిచి ప్రశంసలు అందుకుంటోంది కుమనన్. ప్రపంచకప్ సెయిలింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది.
మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేత్రకు 2011లో వేసవి శిబిరం ద్వారా సెయిలింగ్ పట్ల ఆసక్తి ఏర్పడింది. అన్న సెయిలర్ కావడం వల్ల ఈ క్రీడలో ఆమె వేగంగా ఎదగడానికి తోడ్పడింది. 2012లో జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన నేత్ర.. ఆ తర్వాత పలు జాతీయ పతకాలు ఖాతాలో వేసుకుంది.
సెయిలింగ్ పోటీల్లో నేత్ర 2014, 2018 ఆసియా క్రీడల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నేత్ర.. ప్రపంచకప్‌లోనూ మెరిసింది. ప్రపంచకప్‌లో లేజర్ రేడియల్ క్లాస్‌లో ఒక దశలో అగ్రస్థానంలో దూసుకెళ్లిన నేత్ర.. చివరికి కాంస్యంతో సరిపెట్టుకుంది. మార్చి 15న ఆరంభమయ్యే ఆసియా సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌లో రాణించడమే నేత్ర ముందున్న లక్ష్యం. ఇది ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడం వల్ల ఈ టోర్నీలో సత్తా చాటి టోక్యో బెర్తు సంపాదించాలని ఈ 22 ఏళ్ల సెయిలర్ భావిస్తోంది.