ఏసియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్స్ కోసం స్లొవేనియాకు ట్రైనింగ్‌కు వెళ్లిన భారత బృందం తక్షణమే తిరిగిరావాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆదేశించింది. కోచ్ ఆర్కే శర్మ.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బృందంలోని మహిళ సైక్లిస్ట్ ఆరోపించిన నేపథ్యంలో సాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 3న ఆ మహిళా సైక్లిస్ట్ భారత్ చేరుకోగా.. మిగతా వారు త్వరలో భారత్‌కు తిరిగిరానున్నారు. బాధితురాలి ఆరోపణలపై కమిటీ ఏర్పాటు చేసిన సాయ్.. దర్యాప్తు చేపడుతోంది.
కోచ్ బెదిరింపులు: నిందితుడు మసాజ్ చేస్తానంటూ గదిలోకి బలవంతంగా వచ్చేవాడని.. వివాహం చేసుకోమని బలవంతం చేసేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 'కాదంటే నా కెరీర్‌ను నాశనం చేస్తానని.. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. నేను ట్రైనింగ్ క్యాంప్ వదిలి భారత్ వచ్చేశాక కూడా నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. నాకు భవిష్యత్తు లేదని తనతో వివాహం జరిపించమని చెప్పాడు' అని బాధితురాలు వెల్లడించింది.