దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల్లో ట్రిపుల్ సెంచరీని సమీపించింది. సోమవారం ఒక్కరోజే మన అథ్లెట్లు 27 స్వర్ణాలు సహా 42 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ఇంకో రోజు మాత్రమే మిగిలున్న ఈ పోటీల్లో భారత్ 297 (163 స్వర్ణాలు, 91 రజతాలు, 43 కాంస్యాలు) పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
పోటీల ఎనిమిదో రోజు బాక్సర్లు ఆరు స్వర్ణాలు, ఒక రజతం సాధించారు. అంకిత్ (75 కేజీలు), వినోద్ (49 కేజీలు), సచిన్ (56 కేజీలు), గౌరవ్ చౌహాన్ (91 కేజీలు), కలైవాణి (48 కేజీలు), పర్వీన్ (60 కేజీలు) పసిడి పతకాలు గెలవగా, మనీష్ కౌశిక్ (64 కేజీలు) రజతంతో సరిపెట్టుకున్నాడు. రెజ్లింగ్‌లో గౌరవ్ (74 కేజీలు), అనిత షెరోన్ (68 కేజీలు) పసిడి గెలవగా, ఫెన్సింగ్‌లో మూడు స్వర్ణాలు వశమయ్యాయి.
పురుషుల ఫొయిల్, మహిళల టీమ్ ఇపీ, మహిళల టీమ్ సాబెర్ విభాగాల్లో మన ఫెన్సర్లు పసిడి గెలిచారు. షూటింగ్ ఎయిర్‌పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్లో అనురాజ్, శర్వణ్‌కుమార్ స్వర్ణం నెగ్గగా, భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు వరుసగా రెండో పసిడి నెగ్గింది. ఫైనల్లో 2-0తో నేపాల్‌ను ఓడించింది. బాస్కెట్‌బాల్ పురుషుల, మహిళల జట్లూ స్వర్ణాలు గెలిచాయి.