"ఆటలంటా ఆటలు.. ఆడపిల్లవూ ఓ అయ్య చేతిలో పెడితే మా భారం దిగుతుంది" అని ఓ పేద తండ్రి.. "ఆటలు మగపిల్లలకు మాత్రమే.. ఆడపిల్లలకు ఎందుకు" అని ఓ మధ్య తరగతి కుటుంబీకుడు.. "నీకెందుకు ఆటలు శుభ్రంగా చదువుకోగా.." అని పరువుకు ప్రాధాన్యమిచ్చే ఓ ఇంటి పెద్ద.. తరగతి ఏదైనా.. ఒకప్పుడు వీరందరి నోటా ఇదే మాట.. ఆడపిల్లలకు ఆటలెందుకు? ఇప్పుడు పరిస్థితి మారింది మగవాళ్లకు దీటుగా క్రీడల్లో రాణిస్తున్నారు మహిళలు. ఈ ఏడాది పురుషులు ఆధిపత్యం వహించే ఆటల్లోనూ అదరగొట్టారు కొంత మంది అతివలు.
పీవీ సింధు..
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం కైవసం చేసుకొని క్రికెటర్ కాకుండా అత్యంత పాపులరైన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది సింధు. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించింది. ఆగస్టు 25న నవోమీ ఒకుహురాపై 21-17, 21-7 తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా.. మహిళల సింగిల్స్‌లో అంతర్జాతీయ ఈవెంట్లలో ఆరు సార్లు తలపడి 5 మెడల్స్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం 13వ ర్యాంకులో ఉన్న సింధు.. ఈ ఏడాది అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఇటీవల వరుసగా మేజర్ టోర్నీల్లో విఫలమైనప్పటికీ 2020 టోక్యో ఒలింపిక్సే లక్ష్యంగా కృషి చెస్తోంది ఈ తెలుగు తేజం.
మేరీ కోమ్..
బాక్సింగ్ అంటే మగవాళ్లు మాత్రమే ఆడే క్రీడ అని భ్రమపడుతున్న రోజుల్లో.. మహిళల్లో స్ఫూర్తి నింపి ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది మేరీ కోమ్. ఈ ఏడాది జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని దక్కించుకుని.. సక్సెస్ఫుల్ బాక్సర్‌గా ఘనత సాధించింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయినా.. ఈ ఏడాది గువాహటి వేదికగా జరిగిన ఇండియా కప్, ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెంట్ కప్‌లో స్వర్ణాలు నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.
వినేశ్ ఫొగాట్..
గీత, బబితా తర్వాత ఫొగాట్ కుటుంబం నుంచి వచ్చిన మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్. 25 ఏళ్ల ఈ హరియాణా కుస్తీ క్రీడాకారిణి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ ఏడాది వరుసగా మూడు స్వర్ణాలు నెగ్గింది వినేశ్. ఆసియన్, యాసర్ డోగు ఇంటర్నేషనల్, పొలాండ్ ఓపెన్‌ల్లో పసిడి పతకాలు చేజిక్కించుకుంది.