సాధారణంగా ఆడేటప్పుడు ఆటగాళ్లకు గాయాలవ్వడం సహజమే. అయితే కొన్ని సందర్భాలో గాయాలు కాస్త పెద్దగానే తగులుతుంటాయి. తాజాగా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ గోల్ తగలడం వల్ల ఓ ఆటగాడి తల పగిలి విపరీతంగా రక్తం కారింది.
ఇదీ జరిగింది.. ఈ ఘటన వార్సాలో జరుగుతున్న ఛాంపియన్ లీగ్‌లో చోటు చేసుకుంది. లీగ్‌లో భాగంగా గ్రూప్-ఎఫ్‌లో రియల్ మాడ్రిడ్, షాఖ్తర్ దొనేత్సక్‌ల మధ్య బుధవారం తెల్లవారుఝామున మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి షాఖ్తర్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో ఐదు నిమిషాలు అదనపు సమయం ఇవ్వడంతో రియల్ మాడ్రిడ్ జట్టు గోల్ కొట్టడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే ఆట 95వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ ఢిఫెండర్ ఆంటోనియో రూడిగర్ హెడర్ గోల్ చేశాడు. ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. బంతిని తలతో బలంగా కొట్టే క్రమంలో రూడిగర్ పైకి ఎగరగా.. అదే సమయంలో షాఖ్తర్ గోల్ కీపర్ అనటోలీ ట్రూబిన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ట్రూబిన్ తలభాగం రూడిగర్ నుదుటన గట్టిగా గుద్దుకుంది. అయితే అప్పటికే బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిపోవడంతో రియాల్ మాడ్రిడ్- షాఖ్తర్ దొనేత్సక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
మరోవైపు దెబ్బ తగలడం వల్ల రూడిగర్ తల నుంచి రక్తం ధారగా కారింది. అయితే ట్రూబిన్ తలకి కూడా దెబ్బ బలంగానే తాకింది. దీంతో వెంటనే వారిద్దరి ఆస్పత్రికి తరలించారు. కాగా, ట్రూబిన్ తల చుట్టూ బ్యాండేజీ వేయగా.. రూడిగర్ మొహానికి 20 కుట్లు పడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: చిన్నారి అథ్లెట్ అద్భుత విన్యాసాలు.. 36వ జాతీయ క్రీడల్లో రికార్డ్