టీమ్ఇండియాలో కీలక ఆటగాళ్లుగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీల ఫామ్ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఆసియా కప్ నుంచి విరాట్ ఆటతీరు మెరుగుపడగా.. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అతడు మంచి ప్రదర్శనే కనబర్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంతో విమర్శల పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫామ్ లేమిపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ప్రతి క్రికెటర్ జీవితంలో ఇలాంటి దశ సహజమేనని.. సునీల్ గావస్కర్ మొదలుకుని కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ వరకు ఎంతో మంది ఈ దశను దాటి వచ్చినవారేనని రవిశాస్త్రి గుర్తు చేశారు.
'వారంతా ఆ దశను దాటి వచ్చినవారే'.. కోహ్లీ, రోహిత్ ఫామ్‌పై రవిశాస్త్రి కామెంట్స్ - Ravi Shastri comments on form of Kohli
కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం, రోహిత్ కొంతకాలంగా ఆశించిన విధంగా ప్రదర్శన కనబర్చకపోవడంపై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇలాంటివి క్రికెట్లో సహజమని, ప్రతి ఆటగాడు ఈ దశను దాటి వచ్చినవారేనని గుర్తు చేశారు.
"ప్రతి క్రికెటర్‌కి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ తెందూల్కర్, ధోనీ సహా ఎంతో మంది ఈ దశను తప్పించుకోలేకపోయారు. ప్రతి ఒక్కరికీ వారి సమయం అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్లపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది సెంటిమెంట్‌గా మారింది. ముఖ్యంగా భారతీయులమైన మనం చాలా ఆశిస్తాం. అదే సమయంలో నిలకడగా ఉండాలని కోరుకుంటాం.
కానీ వారు కూడా మనుషులే. ప్రతిసారి మంచి ఇన్నింగ్స్ ఆడలేరు. కొన్నిసార్లు మాత్రమే అలా జరుగుతుంది. వారు తిరిగి ఫామ్‌లోకి వస్తారు" అని రవిశాస్త్రి వివరించారు.ఇదిలా ఉండగా, కివీస్ టూర్‌కు విశ్రాంతి తీసుకున్న రోహిత్, కోహ్లీ.. డిసెంబరు 4 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నారు. కోహ్లీ, రోహిత్ వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసేందుకు మరో 86 పరుగుల దూరంలో ఉన్నారు. బంగ్లా టూర్‌లో ఈ ఘనతను సాధించే అవకాశముంది.