15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా.. అత్యంత పిన్న వయసులో ఆ ఘనత సాధించిన అమ్మాయిగా ప్రపంచ రికార్డు.. పదేళ్ల వయసులో ప్రపంచ యూత్ చెస్‌లో మూడు స్వర్ణాలతో సంచలనం.. ఆపై జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్.. 2600కు పైగా ఎలో రేటింగ్ సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఘనత.. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం.. ఇలా ఆమె ఖాతాలో ఎన్నెన్ని ఘనతలో.
అయితే ఇవన్నీ ఒకెత్తు..! ఇప్పుడు సాధించిన ఘనత మరో ఎత్తు..! పెళ్లి చేసుకుని.. బిడ్డకు తల్లి అయి.. రెండేళ్లకు పైగా ఆటను పక్కన పెట్టేసి.. మరో ప్రపంచంలోకి వెళ్లిన ఆమె.. మళ్లీ చెస్‌లోకి రావడమే ఆశ్చర్యం! వచ్చాక స్వీయ సాధనతో మళ్లీ ఆటలో పతాక స్థాయికి చేరుకుని.. ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారులతో తలపడి ఇన్నేళ్ల కెరీర్లో సాధించని అద్భుత విజయాన్నందుకోవడం.. అది కూడా తనకు అంతగా కలిసిరాని ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్ కావడం అనూహ్యం. మన చదరంగ బంగారం కోనేరు హంపి గొప్పదనం గురించి ఇంతకంటే ఏం చెప్పాలి.
భారత మహిళల చెస్‌కు కోనేరు హంపిని ముఖచిత్రంగా చెప్పొచ్చు. దేశంలో మహిళల చెస్‌కు సంబంధించి అనేక తొలి విశేషాలు హంపి పేరుతోనే ముడిపడి ఉంటాయి. విశ్వనాథన్ ఆనంద్ దేశంలో చెస్ విప్లవానికి తెర తీస్తే.. ఆ ఒరవడిని అందిపుచ్చుకుంటూ మహిళల చెస్‌లో గొప్ప విజయాలతో తన ప్రత్యేకతను చాటుకుంది హంపి. 1997లో ప్రపంచ యూత్ చెస్‌లో ఒకేసారి అండర్-10, 12, 14 విభాగాల్లో స్వర్ణాలు గెలవడం వల్ల పదేళ్ల హంపి పేరు మార్మోగింది. ఆ తర్వాత దిగ్గజ క్రీడాకారిణి జుడిత్ పోల్గర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతూ అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 67 రోజులు) గ్రాండ్‌మాస్టరైన మహిళా క్రీడాకారిణిగా 2002లో రికార్డు నెలకొల్పాక హంపి స్థాయి ఏంటో మరోసారి అందరికీ అర్థమైంది. ఆ తర్వాత పుష్కర కాలంలో హంపి ఎన్నో గొప్ప విజయాలందుకుంది. అయితే భారత చెస్ అభిమానులు కోరుకున్నట్లు, విశ్వనాథన్ ఆనంద్ ఆశించినట్లు ప్రపంచ ఛాంపియన్ కాకపోవడం హంపి కెరీర్లో లోటే.
పెళ్లయ్యాక కాంస్యం.. తల్లయ్యాక స్వర్ణం
ఆట ఏదైనా సరే.. మహిళా క్రీడాకారిణులు పెళ్లి చేసుకుంటే వాళ్ల కెరీర్ అయిపోయినట్లే అని భావిస్తారు. అయితే పెళ్లి తర్వాతే హంపి కెరీర్ గొప్ప మలుపు తీసుకోవడం విశేషం. 2014లో దాసరి అన్వేష్‌ను పెళ్లాడిన హంపి.. తర్వాతి ఏడాది ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్ (క్లాసిక్)లో కాంస్యం సాధించింది. అయితే తర్వాతి ఏడాది ఆమె తల్లి కావడం వల్ల చెస్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు ఆట జోలికే వెళ్లలేదు. తన పాపకు ఏడాది వయసు వచ్చే వరకు ఆమె ఆటను త్యాగం చేసింది. అయితే రెండేళ్ల విరామం తర్వాత నిరుడు ఆటలోకి పునరాగమనం చేసినప్పటికీ.. ఈ విరామం ఆమె లయను దెబ్బ తీసి ఉంటుందేమో.. కెరీర్లో మళ్లీ ఉన్నత స్థితిని అందుకోవడం కష్టమేమో అని చాలామంది సందేహించారు. కానీ హంపి అంచనాల్ని తలకిందులు చేసింది. విదేశాలకు వెళ్లి శిక్షణేమీ తీసుకోకుండా తండ్రి సాయంతో సొంతంగా సాధన చేసి మళ్లీ ఫామ్ అందుకుంది. ఈ ఏడాది ఫిడె మహిళల గ్రాండ్ ప్రి టైటిల్ సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో హంపి ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగింది. అక్కడ ఆమె పోటీ పడుతున్నట్లు కూడా చెస్ అభిమానులకు తెలియదు. మీడియాలో కూడా ఈ టోర్నీ గురించి హడావుడి లేదు. కానీ టోర్నీలో నిలకడగా విజయాలు సాధించి.. టైబ్రేక్‌లో ఉత్కంఠను అధిగమించి టైటిల్ సొంతం చేసుకుంది.