దోహ గేమ్స్: నేటి నుంచే 'ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్' నేటి నుంచే 'ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్' పోటీలకు ఆతిథ్యమిస్తోంది ఖతార్. దోహా వేదికగా జరగనున్న ఈ ఆటల్లో చాలా విశేషాలున్నాయి. 200 పైన దేశాలు... దాదాపు 2 వేల మంది అథ్లెట్లు పోటీపడుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో... భారత్ కూడా తన బృందాన్ని బరిలో దింపుతోంది. వేడుక ఏర్పాట్లను స్థానిక డైరెక్టర్ జనరల్ దలన్ ఏ హమద్ పరిశీలించారు.
భారత్ సత్తా చాటేనా..!
ఇప్పటిదాకా 16 టోర్నీలు జరిగినా మన దేశ ప్రదర్శన అంతంత మాత్రమే. అంజూ బాబీ జార్జి (2003) గెలిచిన కాంస్యమే ఈ రోజు వరకు మన అత్యుత్తమ ప్రదర్శన. ప్రతిసారీ పోటీలకు వెళ్లడం... మహా అయితే జాతీయ రికార్డులు తిరగ రాయడం, మరో అడుగు ముందుకేసి ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడం తప్ప.. మన అథ్లెట్లు పెద్దగా మెరిసింది లేదు.
ఈసారి దోహాకు వెళుతున్న 27 మందిలో వ్యక్తిగత విభాగంలో ద్యుతిచంద్ (100 మీ), శ్రీశంకర్ (లాంగ్‌జంప్)లపైనే ఎక్కువ ఆశలున్నాయి. తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీలో తలపడుతున్న కేరళ యువ కెరటం శ్రీశంకర్ భారీ అంచనాలతోనే బరిలోకి దిగుతున్నాడు. గతేడాది జాతీయ అథ్లెటిక్స్‌లో 8.20 మీటర్ల దూరం దూకి సంచలనం సృష్టించాడు ఈ 20 ఏళ్ల అథ్లెట్.
స్థిరంగా మంచి ప్రదర్శనలు చేస్తున్న జిన్సన్ జాన్సన్ (1500 మీ), తేజిందర్ సింగ్ తూర్ (షాట్‌పుట్), ధరుణ్ అయ్యసామి (400 మీ) ఈ టోర్నీలో రాణిస్తారని భారత్ భావిస్తోంది.
రిలే పైనా ఆశలు...
ఇటీవల కాలంలో భారత రిలే జట్ల ప్రదర్శన బాగా మెరుగైంది. పురుషుల, మహిళల విభాగాలతో పాటు మిక్స్‌డ్ విభాగంలోనూ రిలే బృందాలు బరిలో ఉన్నాయి. ఇందులో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచి జట్లు టోక్యో ఒలింపిక్స్ బెర్తు సంపాదిస్తాయి. 400 మీ వ్యక్తిగత పరుగులో మహ్మద్ అనాస్ ఈ టోర్నీకి అర్హత సాధించినా.. రిలే బృందాన్ని ఫైనల్ చేర్చాలన్న లక్ష్యంతో భారత సమాఖ్య అతడిని రిలే జట్టుకే పరిమితం చేసింది.
- ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్ సాధించిన పతకం ఒకటి మాత్రమే. 2003 పారిస్ క్రీడల్లో అంజూ బాబీ జార్జ్ లాంగ్‌జంప్‌లో కాంస్యం గెలిచింది. ఆ తర్వాత మరే అథ్లెటూ పోడియం ఎక్కలేదు.
- భారత్ నుంచి 27 మంది (రిలే జట్లను కలిపి) అథ్లెట్లు పోటీపడుతున్నారు. వీరిలో 16 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు.
- ఈ పోటీలకు హాజరౌతున్న దేశాల సంఖ్య 209. అమెరికా అత్యధికంగా 159 మంది అథ్లెట్లను బరిలో దింపుతోంది.
ఇదీ చూడండి..