PV Sindhu wins Syed modi international tournament: కొంతకాలంగా ఊహించని ఓటములతో, టైటిళ్లను సొంతం చేసుకోలేక సతమతమవుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో తన టైటిళ్ల కరవుకు తెరదించింది. నేడు(జనవరి 23) సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్న్ మెంట్లో భాగంగా జరిగిన మహిళ సింగిల్స్ ఫైనల్లో సత్తాచాటి ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించింది.
ఈ పోరులో భారత్‌కే చెందిన మాల్‌వికా బన్‌సోద్‌తో తలపడిన సింధు.. 21-13,21-16 తేడాతో పూర్తి ఆధిపత్యం చెలాయించి చివరకు విజయ దుందుభి మోగించింది. ఈ మ్యాచ్ 35 నిమిషాల పాటు సాగింది.
సింధుకు ఇది రెండో సయ్యద్ మోదీ ట్రోఫీ. మొదట 2017లో ఈ టైటిట్ చేజిక్కించుకుంది. 2019లో గ్లాస్గోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తర్వాత.. మరే అంతర్జాతీయ పోరులోనూ సింధుకు టైటిల్ దక్కలేదు. సింధు గతేడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత సింధుకు ఇదే మొదటి టైటిల్.