Pv Sindhu Carolina Marin Fight :భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, స్పెయిన్ అగ్రశ్రేణి షట్లర్ కరోలినా మారిన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకప్పుడు తామిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్పిన వీరు.. తాజాగా డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భాగంగా జరిగిన సెమీస్ పోరులో.. ఒకరినొకరు దూషించుకుంటూ పలుమార్లు కనిపించారు. ఒకరిపై మరొకరు అరుచుకుంటూ వ్యాఖ్యలు చేసుకుంటూ.. చివరికి అంపైర్ నుంచి హెచ్చరికలు అందుకున్నారు. పసుపు కార్డులు కూడా అందుకున్నారు.
వివరాళ్లోకి వెళితే.. మూడు గేమ్‌ల పాటు జరిగిన ఈ సెమీస్ పోరులో సింధు 18-21, 21-19, 7-21 తేడాతో ఓడింది సింధు. మారిన్ చేతిలో సింధుకు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో పాయింట్ సాధించిన ప్రతిసారి ఏదో ఒకటి అనుకుంటూ పరస్పరం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసుకున్నారు. ఇరువురు ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకున్నారు. దాంతో సింధు, మారిన్లను అంపైర్ అనేక సార్లు హెచ్చరించారు. పాయింట్లు గెలిచిన తర్వాత మరీ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకోవద్దని సూచించారు.
కానీ మారిన్ అస్సలు ఎక్కడా తగ్గలేదు. అలాగే సర్వీస్‌ను స్వీకరించేందుకు సింధు ఎక్కువ సమయం తీసుకోవడం కూడా అంపైర్‌ను అసంతృప్తికి గురి చేసింది. దీంతో సింధును కూడా రెండు సార్లు అలా చేయొద్దని అన్నారు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సర్వీస్ ఎదుర్కునేందుకు వెంటనే సిద్ధం కావాలంటూ సింధుకు అంపైర్ సూచించారు. అప్పుడు "గట్టిగా అరిచేందుకు మారిన్‌కు అనుమతిస్తున్నారు. ముందు ఆమెకు చెప్పండి. ఆ తర్వాత నేను రెడీగా ఉంటా" అని సింధు చెబుతూ వినిపించింది.