భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నిక లాంఛనమైంది. పరుగుల రాణి పీటీ ఉషను ఈ అత్యున్నత పదవి వరించనుంది. డిసెంబర్లో జరిగే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు కూడా నామినేషన్లు సమర్పించారు. అధ్యక్ష పదవికి మరెవరూ నిమినేషన్ వేయలేదు. దీంతో పీటీ ఉష ఎన్నిక దాదాపు ఖాయమైంది. అథ్లెటిక్స్‌లో ఎన్నో పథకాలు సొంతం చేసుకున్న ఉష.. కీర్తి కిరీటంలో ఇది మరో మైలురాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆదివారం ఆఖరి తేదీ కాగా.. వివిధ పదవులకు మొత్తం 24 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో 12 మంది.. నాలుగు కార్యనిర్వాహక మండలి సభ్యుల స్థానాలకు పోటీపడ్డారు.
కాగా ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్లోని వివిధ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధ్యక్షుడు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రెండు వైస్ ప్రెసిడెంట్ స్థానాలు(ఒకటి పురుషులకు, ఒకటి మహిళ), కోశాధికారి, రెండు జాయింట్ సెక్రటరీ స్థానాలు(పురుషుడు, మహిళ), 6 కార్యనిర్వాహక మండలి సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఈ ఆరుగురిలో ఇద్దరు అథ్లెట్స్ కమిషన్ ప్రతినిధులు ఉంటారు. ఇప్పటివరకు పీటీ ఉష వివిధ ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారు. 1984లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డల్స్ ఈవెంట్ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచారు.