ఒలింపిక్స్లో అథెట్ల నిరసనలు, రాజకీయ సందేశాలను ప్రదర్శించడంపై నిషేధం కొనసాగుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్లో పోడియంపై అథ్లెట్లు పిడికిలి పైకెత్తడం, మోకాళ్లపై కూర్చుని సంఘీభావం తెలపడం లాంటి చర్యలకు తావులేదు. ఏడాది కాలంగా 3,500 కంటే ఎక్కువ మంది అథ్లెట్లపై సర్వే నిర్వహించి వాళ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిరసన చర్యలపై నిషేధం కొనసాగించాలని నిర్ణయించినట్లు ఐఓసీ ప్రకటించింది.
ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి నిరసన తెలిపితే వాళ్లపై తీసుకునే చర్యల గురించి ఐఓసీ ఇంకా స్పష్టతనివ్వలేదు. కానీ అవి తీవ్రంగానే ఉంటాయని ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అథ్లెట్ల ప్రతినిధి కిర్స్టీ పేర్కొన్నాడు. ఒలింపిక్స్ నియమావళిలోని 50వ నిబంధన ప్రకారం ఆ మెగా క్రీడల్లో రాజకీయ, మతపరమైన, జాతివివక్ష సందేశాలకు చోటు లేదు.
ఐఓసీ నిర్ణయంతో అమెరికా ఒలింపిక్, పారాలింపిక్ కమిటీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆ క్రీడల్లో తమ దేశ అథ్లెట్లు జాతీయ గీతం సమయంలో పిడికిలి పైకెత్తడం, మోకాళ్లపై కూర్చోవడం లాంటివి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోమని గతేడాది ఆ కమిటీ ప్రకటించింది. 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' అని రాసి ఉన్న దుస్తులు వేసుకోవచ్చని కూడా తెలిపింది. కానీ టోక్యోలో మాత్రం 'శాంతి, గౌరవం, సంఘీభావం, అంతర్భాగం, సమానత్వం' పదాలు ఉండే టీషర్ట్స్ మాత్రమే అథ్లెట్లు ధరించాలని ఐఓసీ వెల్లడించింది.