తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్వాగతం 2020: క్రీడల జాతర.. అదిగదిగో టోక్యో

ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగుల్చిన 2019... 2020కి స్వాగతం పలికింది. కొత్త సంవత్సరానికి కొత్త ఆశల్ని మోసుకొచ్చింది. ఈ ఏడాది.. టోక్యో ఒలింపిక్స్, టీ20 క్రికెట్ ప్రపంచకప్​ సహా ఎన్నో క్రీడల్లో రాణించేందుకు భారత ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు.

PREVIEW STORY OF SPORTS 2020 OF INDIAN ATHLETS
స్వాగతం 2020: క్రీడల జాతర.. అదిగదిగో టోక్యో

By

Published : Jan 1, 2020, 9:08 AM IST

బ్యాడ్మింటన్‌ తార పి.వి.సింధు, చెస్‌ రాణి కోనేరు హంపి రూపంలో ఇద్దరు ప్రపంచ ఛాంపియన్లు, క్రికెట్లో నంబర్‌వన్‌ కిరీటం, అథ్లెటిక్స్‌లో హిమదాస్‌ పతకాల జోరు.. షూటింగ్‌లో ఎగసిన యువ కెరటాలు..! వెరసి 2019 ఏడాది భారత క్రీడారంగం వెలిగిపోయింది.. అంతేనా ఇక ముందుంది మరింత మజా! వచ్చేసింది 2020..! క్రీడా లోకంలో ఉత్సాహన్ని నింపేందుకు.. అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ఒలింపిక్స్‌ లాంటి మహా క్రీడా సంబరం.. టీ20 ప్రపంచకప్‌ లాంటి మెగా క్రికెట్‌ టోర్నీ.. ఎన్నో మరెన్నో ఈవెంట్లతో ముస్తాబైంది కొత్త ఏడాది! ఆ ముచ్చట్లలోకి ఒకసారి తొంగి చూద్దాం రండి!

టోక్యో ఒలింపిక్స్ 2020

వాళ్లూ ఉన్నారు

రియో ఒలింపిక్స్‌లో మనోళ్లు నిరాశ పరిచినా.. అక్కడే జరిగిన పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. అయిదు క్రీడాంశాల్లో 19 మంది బరిలో దిగగా.. 2 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం భారత్‌ సొంతం చేసుకుంది. మరియప్పన్‌ తంగవేలు (స్వర్ణం), దేవేంద్ర ఝాఝారియా (స్వర్ణం), దీపా మలిక్‌ (రజతం), వరుణ్‌సింగ్‌ (కాంస్యం) మెరిశారు. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఈ జోరు కొనసాగించడానికి భారత బృందం సిద్ధంగా ఉంది. టోక్యోలోనే ఒలింపిక్స్‌ అనంతరం పారాలింపిక్స్‌ జరగనున్నాయి.

పారా ఒలింపిక్స్ 2020

మస్త్‌ మస్త్‌ మహిళల క్రికెట్‌

పురుషుల టీ20 ప్రపంచకప్‌ జరగనున్న ఈ ఏడాదే మహిళలు సైతం టీ20 ప్రపంచ టైటిల్‌ కోసం తలపడనున్నారు. ఈ ఈవెంట్‌ను ఫిబ్రవరిలో చూడబోతున్నాం. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు సైతం ఆస్ట్రేలియానే వేదికగా కాబోతోంది. 2018లో జరిగిన పొట్టి కప్పులో ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. టీమ్‌ఇండియా పోరాటం సెమీస్‌లో ముగిసింది. దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం.

మహిళల టీ20 ప్రపంచకప్​

చలో టోక్యో

ఒలింపిక్స్‌ ముందు ఏ క్రీడా సంబరమైనా దిగదుడుపే! ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసే ఈ మెగా ఈవెంట్‌ ఉన్న ఏడాది క్రీడాభిమానుల సంబరాలకు అంతుండదు. ఈసారి టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ మహా సంగ్రామానికి రంగం సిద్ధమవుతోంది. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు క్రీడాభిమానుల దృష్టంతా టోక్యో పైనే ఉండనుంది. ఒలింపిక్స్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా క్రీడలకు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న జపాన్‌.. ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నంలో ఉంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమంగా క్రీడల్ని నిర్వహించేందుకు జపాన్‌ చేస్తున్న సన్నాహాలు ఇప్పటికే ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. ఈసారి ఎలాగైనా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్య పెంచుకోవాలని భారత్‌ ఆరాటపడుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో సింధు రజతం, రెజ్లింగ్‌లో సాక్షి మలిక్‌ కాంస్య పతకాలు సాధించారు. 117 మంది క్రీడాకారులు బరిలో దిగగా.. కేవలం రెండే రెండు పతకాలతో భారత్‌ తిరిగొచ్చింది. పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది. ఈసారైనా రాత మారాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

సింధు(బ్యాడ్మింటన్‌), బజ్‌రంగ్‌ పూనియా (రెజ్లింగ్‌), మను బాకర్‌, సౌరభ్‌ చౌదరి (షూటింగ్‌), మేరీకోమ్‌ (బాక్సింగ్‌), మీరాబాయ్‌ చాను (వెయిట్‌ లిఫ్టింగ్‌), నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో)లపై భారత్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. మనవాళ్ల ప్రదర్శనతో పాటు అంతర్జాతీయ తారల విన్యాసాలు చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు భారత అభిమానులు.

వేసవిలో ఎప్పట్లాగే

మహేంద్ర సింగ్ ధోనీ

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. ప్రతి ఏడాదీ వేసవిలో క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేసే పొట్టి క్రికెట్‌. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు.. అత్యున్నత స్థాయిలో.. హోరాహోరీగా తలపడే మ్యాచ్‌లంటే క్రికెట్‌ అభిమానులకు ఎంతో ఆసక్తి. వేసవిలో ఐపీఎల్‌ సందడి లేని ఇల్లుండదంటే అతిశయోక్తి కాదేమో! గత ఏడాది ప్రపంచకప్‌ కోసమని ఐపీఎల్‌ను ముందుకు జరిపారు. ఈ ఏడాది మాత్రం ఎప్పట్లాగే ఏప్రిల్‌- మే నెలల్లో ఐపీఎల్‌ అభిమానులకు క్రికెట్‌ విందు అందించనుంది. ఐపీఎల్‌-13లోనూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్సే గెలుస్తుందా.. చెన్నై నెగ్గుతుందా.. ఈ రెండూ కాకుండా మరో జట్టు టైటిల్‌ ఎగరేసుకుపోతుందా అన్నది ఆసక్తికరం.

ఇంకా మరెన్నో

బియాంక ఆండిస్కు

మెగా ఈవెంట్లు కాక టెన్నిస్‌లో ఏటా జరిగే నాలుగు ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌లు ఉండనే ఉన్నాయి. జనవరి 20న ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఆరంభమవుతుంది. మరోవైపు ఫార్ములావన్‌ ప్రియుల్ని అలరించడానికి రసవత్తర రేసులు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 15న ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రితో సీజన్‌ ఆరంభమవుతుంది. నవంబరు 29న అబుదాబి గ్రాండ్‌ప్రి వరకు రేసులే రేసులు. ఏప్రిల్‌లో గోల్ఫ్‌ సందడి ప్రారంభం కానుంది. పురుషుల్లో తొలి మేజర్‌ టోర్నీ గోల్ఫ్‌ మాస్టర్స్‌కు అమెరికాలోని జార్జియా ఆతిథ్యం ఇవ్వనుంది. క్యూ స్పోర్ట్స్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌ ఇంగ్లాండ్‌ వేదికగా ఏప్రిల్‌, మే నెలల్లో జరగనుంది. సైక్లింగ్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ టూర్‌ డి ఫ్రాన్స్‌ కూడా ఏడాది మధ్యలో అభిమానుల్ని అలరించబోతోంది.

టెన్నిస్ టోర్నీలు, ఇతర క్రీడా పోటీల తేదీలు

మినీ సాకరం

2019ని గొప్పగా ముగించిన భారత క్రికెట్‌ జట్టు.. కొత్త ఏడాదిలో శ్రీలంకతో మూడు టీ20 సిరీస్‌తో బరిలో దిగుతోంది. తొలి టీ20 జనవరి 5న జరగనుంది. ఈ సిరీస్‌ తర్వాత జనవరిలోనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లోనూ కోహ్లి సేన తలపడుతుంది. తొలి వన్డే 14న జరుగుతుంది.

యూరో ఫుట్​బాల్ లీగ్ 2020

ఫుట్‌బాల్‌ ప్రియులకు ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఆకర్షించే టోర్నీ.. యూరో కప్‌. పోటీ పడేది ఐరోపా జట్లే కానీ.. ఫుట్‌బాల్‌ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఈ టోర్నీని చూస్తుంది. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌ లాంటి అగ్ర జట్లు బరిలో నిలిచే ఈ టోర్నీని మినీ సాకర్‌ ప్రపంచకప్‌గా చెప్పొచ్చు. నెల రోజుల ఈ టోర్నీ జూన్‌లో ఆరంభమవుతుంది.

యూరో కప్‌
జూన్‌ 12 నుంచి జులై 12 వరకు.
వేదిక: ఐరోపా

ధనాధన్‌ మళ్లొచ్చింది

పురుషుల టీ20 ప్రపంచకప్​

ఇంతకుముందు రెండేళ్లకోసారి ఠంచన్‌గా అభిమానుల ముందుకొచ్చేది టీ20 ప్రపంచకప్‌. ఒకప్పుడైతే 9 నెలల వ్యవధిలోనే రెండు కప్పులు చూశాం. కానీ 2018 టోర్నీ రద్దు కావడంతో ఈసారి నాలుగేళ్ల విరామం వచ్చేసింది. దీంతో వన్డే ప్రపంచకప్‌ లాగే ఈ టోర్నీ కూడా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పొట్టి క్రికెట్లో ప్రపంచ అత్యుత్తమ జట్లు పోటీ పడుతుంటే ఆ మజానే వేరు. అంచనాల్లేకుండా బరిలోకి దిగి తొలి టీ20 ప్రపంచకప్‌ను నెగ్గి ఆశ్చర్యపరిచిన భారత్‌.. మళ్లీ కప్పు ముచ్చటే తీర్చుకోలేకపోయింది. 2016లో భారత్‌ ఆతిథ్యమిచ్చిన చిట్టి కప్‌లో వెస్టిండీస్‌ విజేతగా నిలిచింది. టీమ్‌ఇండియా సెమీస్‌కే పరిమితమైంది. ప్రస్తుతం టీ20 క్రికెట్లో అత్యుత్తమ జట్టుగా కనిపిస్తున్న టీమ్‌ఇండియా ఈసారి ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఓపెనర్‌ రోహిత్‌శర్మల సూపర్‌ ఫామ్‌.. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ల బలమైన బ్యాటింగ్‌.. బుమ్రా, భువనేశ్వర్‌, చాహల్‌, కుల్‌దీప్‌లతో కూడిన అత్యుత్తమ బౌలింగ్‌ టీమ్‌ఇండియాకు తిరుగులేని బలాలు. టీమ్‌ఇండియాకు ఎన్నో అపురూప విజయాలు అందించిన కెప్టెన్‌ కోహ్లి కీర్తి కిరీటంలో ప్రపంచకప్‌ కూడా చేరాలన్నది అభిమానుల ఆశ. 2020లోనే అది నెరవేరుతుందేమో చూడాలి.

సూపర్‌ ఫైనల్స్‌

ఏడాది పొడవునా సూపర్‌ సిరీస్‌లతో బిజీగా ఉండే బ్యాడ్మింటన్‌ క్యాలెండర్‌లో చిట్టచివరి ఈవెంట్‌.. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌. సూపర్‌ సిరీస్‌ ర్యాంకింగ్స్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు తలపడే అత్యున్నత సంగ్రామం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింధుది మెరుగైన రికార్డే. 2016లో సెమీస్‌.. 2017లో ఫైనల్‌ చేరిన సింధు 2018లో విజేతగా నిలిచింది. 2019లో గ్రూపు దశలోనే నిష్క్రమించింది. 2020లో సింధు మరోసారి మాయాజాలం చేస్తుందేమో చూడాలి.

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌

డిసెంబరు 11 నుంచి 15 వరకు.
వేదిక: గాంగ్‌జౌ (చైనా)

మహిళల చెస్‌ ప్రపంచకప్‌
(సెప్టెంబర్‌ 10-అక్టోబర్‌ 3)

మహిళల చెస్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ప్రపంచకప్‌ ఈ ఏడాదే జరగనుంది. బెలారస్‌ వేదికగా ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details